Muslim programme to confront the ‘Neo Manuism’
Muslim programme to confront the ‘Neo Manuism’
నయా మనువాదాన్ని ఎదుర్కోవడానికి
ముస్లిం కార్యక్రమం
-
డానీ
1.
మనదేశంలో నయా మనువాద నియంతృత్వం రాజ్యం చేస్తున్నదని
ఇప్పుడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేకానేక నిస్సహాయ (vulnerable) సమూహాలు చాలాకాలంగా దీని ఉక్కుపాదాల కింద నలిగిపోతున్నాయి.
2.
సాంస్కృతిక జాతీయవాదానికి తొలి బాధితులు మతఅల్పసంఖ్యాకవర్గాలు. ఆ బాధితుల్లోకెల్లా బాధితులు ముస్లింలు.
3.
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారత రాజకీయార్థికరంగాల్లో భౌగోళిక జాతీయవాదం బలంగానూ
సాంస్కృతిక జాతీయవాదం బలహీనంగానూ వుండేవి. కులమతాలు పౌరుల వ్యక్తిగత (ప్రైవేటు) వ్యవహారంగా వుండేవి.
4.
దేశప్రజలకు లౌకిక రాజ్యాంగం ఒక కొత్త మార్గదర్శిగా నిలిచేది. విద్యా ఉపాధి అధికార రంగాల్లో తగిన ప్రాతినిథ్యం దక్కని
సమూహాలు ఎన్నికల ప్రక్రియ ద్వార ప్రభుత్వాల మీద రాజకీయ వత్తిడి తెచ్చి తమ కోసం ఉద్దీపనచర్యల్ని
సాధించుకోవడానికి అవకాశాలు వుండేవి.
5.
వామపక్షాలు, నక్సలైట్ ఉద్యమాల ప్రభావం కారణంగా ప్రధాన
స్రవంతి రాజకీయాల్లోనూ ప్రజాసంక్షేమం అనేది ఒక విలువగా కొనసాగేది. ఇందిరాగాంధి భూసంస్కరణలు, గరీబీహటావో, బ్యాంకుల జాతియీకరణ, ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావుల చౌకబియ్యం, జనతావస్త్రాలు పథకాలు అలావచ్చినవే.
6.
ప్రస్తుతం సాంస్కృతిక జాతీయ వాదానికి ప్రధాన రాజకీయ వేదికగా వుంటున్న భారతీయ
జనతా పార్టి సహితం తన ఆరంభ దశలో ‘గాంధీయ’ సోషలిజం అని నినదించేది.
7.
ఏ చారిత్రక దశలో అయినా ఒకే భావజాలం వుండదు. ఒక నిర్ధిష్ట దశలో కొన్ని భావాలు బలంగావుంటే మరికొన్ని బలహీనంగా వుంటాయి. దశ మారినపుడు వీటి ప్రభావాలూ స్థానాలూ మారిపోతాయి. సాధారణంగా మనుషులు తాము నమ్మే భావజాలం ఒక్కటి మాత్రమే
సమాజంలో వుంటున్నట్టు ఒక భ్రమకు గురవుతుంటారు. ఇతర భావజాలాల ఉనికిని గుర్తించరు. ఏ దశలో అయినాసరే ఆధిపత్యంలోవున్న భావజాలమే తన కాలాన్నిశాసిస్తుంది.
8.
స్వాతంత్ర్యం వచ్చే నాటికి కాంగ్రెస్ లోపల గాంధీజీ, పటేల్, కాంగ్రెస్ బయట సావర్కర్, గోల్వాల్కర్, హెగ్డేవార్ వంటి భిన్న స్రవంతులువున్నప్పటికీ
మొత్తమ్మీద 'నెహ్రూ మార్కు' సామ్యవాద భావాలు బలంగా
వుండేవి. అలాకాకుంటే రాజ్యాంగ సభలో మతసామరస్య, ప్రజాస్వామిక
రాజ్యాంగం ఆమోదాన్ని పొందేదికాదు. "న్యాయం, స్వేఛ్చ, సమానత్వం, సోదరభావం" అనే ఆదర్శాలు భారత రాజ్యాంగ ప్రాణప్రద
ఆదర్శాలుగా మారేవికాదు.
9.
త్రివర్ణ పతాకంలోని రంగులకు ఇప్పుడు వేరే అర్థాలు చెపుతున్నారుగానీ,
తొలిదశలో అది మతసామరస్య చిహ్నంగా వుండేది.
10. మతసామరస్య రాజ్యాంగాన్నేకాదు; త్రివర్ణ పతాకాన్ని సహితం వ్యతిరేకించిన వారు ఆనాడూ వున్నారు. మనువు వాళ్ళ హృదయాలలో వుండేవాడు. అప్పుడు ఆ శక్తులు బలహీనంగా
వున్నాయి. ఇప్పుడు ఆశక్తులు బలపడ్డాయి. చారిత్రక దశ తలకిందులు అయింది.
11. 1990వ దశాబ్దంలో ప్రపంచ రాజకీయార్థికరంగాలు
పెద్ద కుదుపుకు గురయ్యాయి. బౌధ్ధికరంగంలో అప్పటివరకు కొనసాగిన విలువలు
తలకిందులయ్యాయి. తూర్పుయూరప్ లో సామ్యవాదభావాలు బీటలువారాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. వీటి ప్రభావం చాలా వేగంగా భారతదేశం మీద పడింది.
12. ప్రజారంగంలో ప్రైవేటైజేషన్
ప్రవేశించింది. అప్పటి వరకు ప్రైవేటు వ్యవహారంగావుంటున్న
కులమతాలు ముందుకొచ్చి రాజకీయాల్ని శాసించడం మొదలెట్టాయి.
13. సంక్షేమంకన్నా సంస్కృతి
ముఖ్యం అనే వాదాలు బలంగా ముందుకు వచ్చాయి.
14. భౌగోళిక జాతీయవాదాన్ని
సాంస్కృతిక జాతీయవాదం అధిగమించింది. మధ్యయుగాల్లో జరిగినట్టు పరిపాలన విభాగాన్ని మెజారిటీ మతం శాసించడం
మొదలుపెట్టింది.
15. ఆర్థికరంగంలో ‘పేదల నుండి
సంపన్నులకు రక్షణ’ (!), సాంస్కృతిక రంగంలో ‘అల్పసంఖ్యాకుల నుండి
అధికసంఖ్యాకులకు రక్షణ’ (!) అనే విపరీత ధోరణులు విజృంభించాయి.
16. ప్రజాసంక్షేమం అనే నినాదం
వెనక్కి వెళ్ళిపోయింది; కార్పొరేట్ల సంక్షేమం అనే నినాదం బలంగా
ముందుకు వచ్చింది. మనదిప్పుడు అంబా సాంస్కృతిక విధానం; అంబానీ ఆర్థిక విధానం.
17. 13వ శతాబ్దం ఆరంభం నుండి 19వ శతాబ్దం మధ్యకాలం వరకు
ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ముస్లిం సుల్తానులు భారత ఉపఖండాన్ని పాలించారు.
భారతదేశాన్ని వలసగా మార్చుకోవడానికి వచ్చిన ఫ్రెంచి, డచ్చి, బ్రిటీష్ కంపెనీ
సైన్యాలను ఎదుర్కొన్న వాళ్ళలో అత్యధికులు ముస్లిం రాజులే.
18.
1857లో సిపాయిల తిరుగుబాటు విఫలం
అయ్యాక, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా
జాఫర్ ను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బందీని చేసి అండమాన్ జైలుకు పంపించాక (సర్
సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పినట్టు) భారత ముస్లింల చరిత్ర “పరాజితుల ఆక్రందన”గా సాగింది.
19. మధ్యయుగాల్లో
ముస్లిం రాజులు చేసిన తప్పులకు వాళ్ళ సంతతిని కార్పొరేట్ల యుగంలో కఠినంగా
శిక్షిస్తాం అనే వికృత వాదనలు కూడ ఇప్పుడు
వినిపిస్తున్నాయి.
20. నయామనువాద భావజాలాలు
ముస్లింలను నడిరోడ్డు మీద చుట్టుముట్టి నరికి చంపినా తప్పుకాదనే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. దీనికి లించింగ్, మూకోన్మాదం అనే ముద్దుపేర్లు కూడ వున్నాయి.
21. గత మూడు దశాబ్దాలుగా
మనదేశంలో చెలరేగుతున్న ఈ భావజాలాల్ని రెండు పాయలుగా వర్గీకరించవచ్చు. వీటిల్లో మొదటివి; ముస్లింలను ‘అన్యులుగా ’చిత్రిస్తుంటాయి. రెండోవి; ముస్లింలను నిర్లక్ష్యం చేస్తుంటాయి.
22. ఆధునిక రాజకీయ
స్రవంతుల్లో ముస్లిం ఆలోచనాపరులు కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్టు పార్టిని ఎక్కువగా నమ్ముకున్నారు. భారత
కమ్యూనిస్టు పార్టి వ్యహస్థాపనలో ముజఫ్ఫర్ అహ్మద్, మౌలాన హస్రత్ మోహానీ, కాజీ నజ్రుల్ ఇస్లాం తదితరులు
కీలక భూమిక నిర్వహించారు. అంతకు ముందే తాష్కెంట్ లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు
పార్టీలోనూ ముస్లింలదే కీలకపాత్ర.
23. అభ్యుదయ రచయితల
ఉద్యమంగా పిలిచే అంజుమన్ తరక్కీ పసంద్ ముస్సనఫీన్ –ఏ- హింద్ సభ్యుల జాబితాను చూడండి. రాజిందర్ సింగ్ బేడి,
అమృతా ప్రీతమ్, కిషన్ చందర్, ప్రేమ్ చంద్ వంటి ఓ పదిమంది తప్ప మిగిలిన
వారందరూ ముస్లింలే. తెలంగాణ రైతాంగ
సాయుధపోరాటానికి మేధోసరోవరంగా నిలిచిన కామ్రేడ్స్ అసోసియేషన్ లోనూ రాజ్ బహద్దూర్
గౌర్, దేవులపల్లి వేంకటేశ్వర రావు వంటి ఓ నలుగురైదుగురుతప్ప మిగిలిన వాళ్ళందరూ ముస్లింలే.
24. సామదానబేధోపాయాలకన్నా
పవర్ఫుల్ ఉపాయం నిర్లిప్తత. ముస్లింల మీద వామపక్షాలు నిర్లిప్తత
ఉపాయాన్ని ప్రయోగించాయి. అలా వాళ్ళు ముస్లింలను
కాంగ్రెస్ కు టోకుగా అప్పచెప్పారు.
25. వామపక్షాలు
ముస్లింలను అసలు పట్టించుకోక అన్యాయం చేస్తే కాంగ్రెస్ ముస్లింలను పట్టించుకుంటున్నట్టు నటించి మోసం చేసింది.
26. మన సమాజంలో ‘ప్రగతిశీలురు’గా చెలామణి అవుతున్నవారు సహితం ముస్లిం సామాజికవర్గాలకు చేస్తున్న హాని తక్కువదేమీకాదు. ముస్లింలు మతఛాందసులనీ, అంతర్ముఖ సమూహం అనీ, ఇంట్రావర్ట్ కమ్యూనిటీ అనీ, సామాజిక అంశాల్ని పట్టించుకోరని నిందలేసేవారికి ఇప్పుడు
కొదవలేదు.
27. అయితే, ముస్లింల మీద జాలి చూపుతున్న భావజాలాలు కూడ కొన్నున్నాయి. వీటిల్లో కొన్ని; ముస్లింలు తమ మతాన్ని వదులుకోవాలి అంటూ ఒక షరతు విధిస్తున్నాయి. ఇంకొన్ని; ముస్లింలు హిందూమతాన్ని స్వీకరించాలి అంటున్నాయి. లేదా హిందూ మత సమూహానికి ముస్లింలు లొంగివుండాలి అంటున్నాయి. మరికొందరు; ముస్లింలు బౌధ్ధమతాన్ని స్వీకరించాలంటున్నారు. ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినా వీళ్ళందరి అభిప్రాయం ఒక్కటే; ముస్లింలు తమ అస్తిత్వాన్ని కోల్పోవాలి.
28. ముస్లింలు ఇస్లాంను
వదులుకోవాలని నయా మనువాదులు చేస్తున్న వాదననే ఈ ప్రగతిశీలురూ ముందుకు
తెస్తున్నారు. ఇస్లాంను వదులుకుంటే
ముస్లింలు తమ అస్తిత్వాన్నే కోల్పోతారనే చిన్న లాజిక్ మన ప్రగతిశీలురకు ఇప్పటికీ
అర్థం కావడంలేదు. బహుశ వాళ్ళు అర్థం చేసుకోదలచలేదు.
29. మతవిశ్వాసానికీ,
మతతత్వానికీ తేడా మన కాలపు ఆలోచనాపరులు చాలామందికి తెలీదు. మత భావనలు అలౌకికమైనవి. కానీ, మతవాదాలు లేదా మతతత్వాలు లౌకికమైనవి. మతానికి అలౌకిక తపనవుంటే, మతతత్వానికి లౌకిక ప్రయోజనం
వుంటుంది.
30. ధార్మిక,
ప్రజాస్వామిక రంగాల్లో ‘లౌకిక’ అనే పదం చాలా కాలంగా ఒక బ్రహ్మపదార్ధంగా కొనసాగుతోంది.
31. రాజకీయార్ధిక
రంగాలలో తన ప్రయోజనాలను నెరవేర్చి పెట్టడానికి అనువుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య
వ్యవస్థను పెట్టుబడీదారీ వ్యవస్థ రూపొందించింది. ప్రజాస్వామ్యం పనితీరుకు లౌకిక
అనే ఒక కొలమానాన్ని పెట్టింది. దైవ
ప్రసన్నం కోసం కాకుండ దేశ ప్రయోజనాల కోసం పార్లమెంటు పని చేయాలనేది దీని తొలి భావన. దేశ ప్రయోజనం అంటే పెట్టుబడీదారుల
ప్రయోజనం అనేది దీని మలి భావన.
32. సెక్యూలర్ ఇంగ్లీషు
పదానికి లౌకిక నుండి లౌక్యం వరకు అనేక అర్థాలున్నాయి. మతాతీత, మతరహిత, ఐహిక,
ఇహలోక, ప్రాపంచిక, సర్వమత, మతసామరస్య వగయిరా భావనలన్నీ ఈ వ్రుసలోనివే. అనేక మత
సమూహాలు నివశిస్తున్న దేశంలో రాజ్యానికి మతం వుండరాదనేది దీని ప్రధాన ఆదర్శం.
33. భారత ముస్లింల
నిఘంటువులో లౌకిక అంటే మతసామరస్యం అని
అర్థం.
34. ప్రభుత్వం జనాభా
దామాషాగా మతాన్ని ప్రోత్సహించాలి అనే అర్థంలో భారత దేశంలో చాలా కాలం
సెక్యూలర్ భావన కొనసాగింది. వరవరరావు ఒక
ప్రసంగంలో చెప్పినట్టు ముస్లింలకు శుక్రవారం,
క్రైస్తవులకు ఆదివారం కేటాయించేస్తే మిగిలిన ఐదు రోజులు హిందువులకు కేటాయించవచ్చు.
ఇప్పుడు మైనార్టీలకు ఆ పాటి వెసులుబాటును కూడ రద్దు చేసే పనిలో ప్రభుత్వం
వుంది.
35. వర్గం సర్వాంత్ర్యామి.; వర్గంలేని రంగం వుండదు. “ఇప్పటి వరకు మనకు తెలిసిన
చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే” అనే వాక్యంతో ఆరంభం అవుతుంది
కమ్యూనిస్టు ప్రణాళిక. పునాది అంశాల్లోనేగాక ఉపరితల అంశాలైన కళాసాహిత్య
సాంస్కృతిక రంగాల్లోనూ వర్గం వుంటుందని 20వ శతాబ్దం ఆరంభం నాటికే మాక్సిం గోర్కి వంటివారు స్పష్టం చేసేశారు. “రచయితలారా! మీరు ఎటువైపు” అని నిలదీశారంటేనే సాహిత్యంలో వర్గం వుంటుందనేగా అర్ధం?
36. భారతదేశపు కమ్యూనిస్టు
సిధ్ధాంతవేత్తలు అనేకమందికి కమ్యూనిస్టు ప్రణాళికలోని తొలివాక్యమే సరిగ్గా జీర్ణంకాలేదు.
అన్ని రంగాల్లో వున్నట్టే మతరంగంలోనూ యజమాని మతసమూహాలు, శ్రామిక మతసమూహాలు వుంటాయని గుర్తించడానికి వాళ్లకు గుండెలు
సరిపోలేదు. మత అంశాన్ని ముట్టుకునే సాహసం చేయలేకపోయారు. కమ్యూనిస్టులకు కులమతాలుండవంటూ గడుసుగా తప్పించుకునేందుకు
తప్పుడు వాదనల్ని ముందుకు తెచ్చారు.
37. కమ్యూనిస్టు
సిధ్ధాంతవేత్తలు కులమతాల్ని పాటించకపోవచ్చు. కానీ సమాజంలో కొనసాగుతున్న కులమతాల మీద వారు ఏనాడో ఒక వర్గ విశ్లేషణ జరపాల్సింది. వారు ఆ పని చేయకపోవడంతో మతంరంగాన్ని అర్ధం
చేసుకోవడంలో ఒక మేధో ప్రతిష్టంభన కొనసాగింది.
38. మరోవైపు, దేశంలో సాంస్కృతిక జాతీయవాదం మత ప్రాతిపదిక మీద వేయితలల
మహాసర్పంలా పెరిగిపోయింది. దీనివల్ల శ్రామిక మతసమూహాలైన ముస్లింలు, శిక్కులు, క్రైస్తవులు భారీగా నష్టపోయారు.
39. భారత మార్క్సిస్టు శిబిరంలో
మతరంగాన్ని వర్గ విశ్లేషణ చేసి (అప్పటికి) 60 యేళ్ళ మేధో ప్రతిష్టంభనను బద్దలుగొట్టిన
మేధావి కే. వి. రమణారెడ్డి. 1985 నాటి విరసం గద్వాల పాఠశాలలో వారి ప్రసంగ
వ్యాసం ‘మతవర్గతత్వం సమీక్ష’ ఒక మహత్తర ఆవిష్కరణ.
40. ”ఏ మతవర్గ తత్వానికైనాసరే, మతమనే దానిలోనే మూలం వుందనుకోవడం అసమంజసం” అనే ప్రకటనతో మొదలవుతుంది ఆ వ్యాసం. “(సాంస్కృతికజాతీయవాదంవల్ల) లాభపడేదల్లా హిందూవుల్లోని అస్తిపరవర్గాలే. ప్రచారానికీ ప్రభావానికి పనికి వచ్చింది మాత్రం (హిందూవుల్లోని) అల్పమధ్యతరగతి నజ్జు మాత్రమే” “సాంస్కృతిక జాతీయవాదం కమ్యూనిస్టులకు వ్యతిరేకం; అమెరికా సామ్రాజ్యవాదానికి
అనుకూలం” వంటి అమూల్యమైన ఆవిష్కరణలు ఈవ్యాసంలో వున్నాయి. అప్పటినుండి నేను కేవిఆర్ ను భావోద్వేగ అభిమానంతో ‘1000 KV యార్’ అనేవాడిని.
41. ఆ తరువాతి కాలంలో కే.
బాలగోపాల్, వరవరరావు ముస్లిం సామాజికవర్గాల మీద
గొప్ప సానుకూల వైఖరితో వ్యవవహరించారు. ఈ ఘనత విరసానిది. అందుకు ఆ ముగ్గురికీ, విరసానికి మరొక్కమారు ధన్యవాదాలు.
42. కమ్యూనిస్టు
సమూహాల్లో ‘మతవర్గతత్వం సమీక్ష’ ఇంకా గొంతు దిగలేదు. వామపక్ష అభిమానుల్లో ఇప్పటికీ
పాత వాదనలు చేసేవారే ఎక్కువ మంది వున్నారు.
43. సమాజాన్ని
మార్చడానికి పార్లమెంటరీ మార్గం రక్తరహితమనీ, విప్లవమార్గం రక్తసహితమనే నేరేటివ్ చాలా
మందిలో వుంటుంది. నిజానికి పార్లమెంటరీ విధానం కూడ రక్తపాత యుధ్ధం తరువాతనే
ఏర్పడింది. అనుమానం వున్నవాళ్ళు మొదటి కింగ్ ఛార్లెస్ మీద ఆలివర్ క్రామ్వెల్ నాయకత్వంలో
సాగిన బ్రిటన్ అంతర్యుధ్ధాన్నీ పరిశీలించవచ్చు.
44. అస్తిత్వ సమూహాల అణిచివేతకు
పరిష్కారంఏమిటీ? అనే ప్రశ్న దాదాపు మూడు దశాబ్దాలుగా బలంగా
వినిపిస్తూనే వుంది. కొందరు పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గమే
మేలంటున్నారు. ఇంకొందరు సాయుధపోరాటమే శరణ్యం అంటున్నారు. అయితే, వీళ్ళిద్దరు చూపుతున్న రెండు మార్గాల్లోనూ గత ముఫ్ఫయ్యేళ్ళ ప్రొగ్రెస్ రిపోర్ట్
ఏమాత్రం ఉత్తేజకరంగా లేదు.
45. ఇంతటి ప్రతికూల వాతావరణంలో, ముస్లింలు తమ దారిని తామే వెతుక్కోవాల్సి వచ్చింది. తమ కార్యక్రమాన్ని తామే రూపొందించుకోవాల్సి వచ్చింది. తమ ఆందోళనను తామే చేపట్టాల్సివచ్చింది. తమ ఆందోళనా రూపాన్నీ తామే రూపొందించుకోవాల్సి
వచ్చింది.
46. మూడు రంగుల జాతీయ జెండా
నీడన నిలబడి, ఒళ్ళో గాంధీజీ అంబేడ్కర్ల ఫొటోలు పెట్టుకుని, ఒక చేతితో భారత మతసామరస్య రాజ్యాంగాన్ని పట్టుకుని, ఇంకో చేతితో పిడికిలి బిగించి “న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం” అంటూ భారత ముస్లింలు నినదిస్తున్నారు.
47. “అప్పుడు కాలం కడుపుతోవుంది / కార్ల్ మార్క్స్ ను కనింది/ అదనపు విలువల కన్నపు దొంగల్ని/ కలుగుల్లోనే పట్టుకున్నాడు మార్క్స్” అన్నాడు మయకోవయోస్కీ. సరిగ్గా అదే తీరులో నయా మనువాద నియంతృత్వాన్ని దేశ రాజధాని నగరంలోనే దిగ్భందించే
వ్యూహాన్ని ముస్లిం మహిళలు కనుగొన్నారు. అదే షాహీన్ బాగ్ ఉద్యమం. It is not a
just discovery; it is an invention.
48. ‘భారత మతసామరస్య రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’ను రూపొందించిన ఘనత భారత ముస్లిం మహిళలదే. దయచేసి ఇకముందు ఎవరూ లౌకిక పదాన్ని పలుచగా వాడవద్దు.
మతసామరస్యం అని స్పష్టంగా వాడండి.
49. ప్రపంచ కమ్యూనిస్టు అభిమానులకు
పారీస్ కమ్యూన్ ఒక దారిని చూపినట్టు భారత అస్తిత్వ సమూహాలకు షాహీన్ బాగ్ ఒక పోరాట రూపాన్ని
అందించింది. నాలుగు నెలలుగా ఢిల్లీలో ఆందోళన సాగిస్తున్న
రైతాంగ నాయకత్వం షాహీన్ బాగ్ ఉద్యమాన్ని సగౌరవంగా తమకు దారిచూపిన తల్లిగా పేర్కొన్నది.
50. “మత సామరస్యం” భారత ముస్లింల సామాజిక కార్యక్రమం. “శాంతి సామరస్య భారత సమాజ నిర్మాణం’ వాళ్ళ రాజకీయ లక్ష్యం. ‘షాహీన్ బాగ్’ వాళ్ల పోరాటరూపం.
51. నయా మనువాద నియంతృత్వానికి
దేశంలో తాము ఒక్కరమే బాధితులుకాదని ముస్లిం
సమాజానికి చాలా స్పష్టంగా తెలుసు. ఆదివాసులు, దళితులు,
బహుజనులు మాత్రమేగాక యజమాని కులాల్లోని పేదలు, సామాన్యులు, తటస్తులు సహితం నయా మనువాద
నియంతృత్వానికి బాధితులే. సామాజిక కార్యకర్తల్లో సామ్యవాదులు, మానవ హక్కులు, పౌరహక్కులు,
పర్యవరణ పరిరక్షణ కార్యకర్తలు సహితం బాధితులే. ఈ జాబితాలో అంతటితో ముగియలేదు. ఇంకా
అనేక సమూహాలున్నాయి.
52. నయా మనువాద నియంతృత్వ
బాధితులందరి సమస్యలూ ఒకటి కావు; వాళ్ళ లక్ష్యాలూ ఒకటికావు. విభిన్న బాధితుల సమస్యల్లో,
లక్ష్యాల్లో ఐక్యత మాత్రమేగాక ఘర్షణ కూడ వుందని ముస్లిం ఆలోచనాపరులు
గుర్తిస్తున్నారు.
53. గమ్యాలు వేరయినా సాటి
అణగారిన సమూహాలతో సాధ్యమయినంత మేరకు కలిసి నయా మనువాద నియంతృత్వానికి వ్యతిరేకంగా గమనం
సాగించడమే నేటి చారిత్రక కర్తవ్యమని ముస్లిం ఆలోచనాపరులు భావిస్తున్నారు.
54. తక్షణ ఉమ్మడి ప్రయోజనాల
సాధన కోసం నయా మనువాద నియంతృత్వ బాధితులందరితో ఒక విశాల సంయుక్త కార్యాచరణ వేదికను
ఏర్పరచే దిశగా ఇప్పుడు ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) పనిచేస్తున్నది.
55. పార్లమెంటరీపంథా, సాయుధపోరాట పంథా కాకుండ ఒక వినూత్న ప్రత్యామ్నాయ మార్గం
భారత రాజకీయాల్లో రావలసివుంది.
56. ఏ చారిత్రక దశలో
అయినా సరే చారిత్రక భారం ఎక్కువగావున్న సమూహాలే పరిష్కారాల్ని కనుగొంటాయి. ఒక అల్పసంఖ్యాకవర్గంగా ఇప్పుడు ముస్లింల మీదే కొత్త మార్గాల్ని
కనిపెట్టాల్సిన చారిత్రక భారం వుంది. ఆ కర్తవ్యాన్ని వాళ్ళు తప్పక నెరవేరుస్తారు.
57. ముందుముందు అనేక అస్తిత్వ
సమూహాలు తమ జీవికను కాపాడుకోవడం కోసం, తమ భవిష్యత్తు కోసం షాహీన్ బాగ్ చూపిన మార్గంలో నడుస్తాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక దేశంలో
వీటి వుధృతి పెరుగుతుంది.
(విరసం విజయవాడ పాఠశాలలో భాగంగా 2021 ఏప్రిల్ 11న ‘ఫాసిజం – భారత అస్తిత్వ సమూహాల ధిక్కారం’ అనే అంశం
మీద నిర్వహించిన సదస్సులో ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) ప్రతినిధిగా చేసిన ప్రసంగ పాఠం)
రచన : 3 ఏప్రిల్ 2021
సవరణ : 12 ఏప్రిల్
2021
Comments
Post a Comment