ఒక మహా ప్రజాఉద్యమం మాత్రమే విశాఖ ఉక్కును రక్షించుకోగలదు!.

 ఒక మహా ప్రజాఉద్యమం మాత్రమే

విశాఖ ఉక్కును రక్షించుకోగలదు!. 

 

ఉక్కు ఉద్యమానికి MTF సంఘీభావం

 

20-02-21 శనివారం – విశాఖపట్నం

21-02-21 ఆదివారం – కాకినాడ

22-02-21 సోమవారం - విశాఖపట్నం

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు.  భారత దేశంలో తీరప్రాంతంలో వున్న ఏకైక స్టీలు ఫ్యాక్టరీ ఇది. 64 గ్రామాల ప్రజలు 33 వేల ఎకరాల భూములిస్తే పుట్టిన ప్రాజెక్టు ఇది.

 

ఫ్యాక్టరీ శంఖుస్థాపన జరగడానికి ముందే దాన్ని పోరుగు రాష్ట్రం తమిళనాడుకు హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కుట్రను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1966లో  పెద్ద ఉద్యమం సాగింది. విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, హైదరాబాద్ విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన సాగించారు. విశాఖకు చెందిన తెన్నేటి విశ్వనాధం ఉద్యమానికి నాయకత్వం వహించారు. గుంటూరుకు చెందిన టి. అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష సాగించారు. ఆనాడు ఏపీలో వున్న రాజకీయ పార్టీలన్నీ ఉద్యమానికి మద్దతు పలికాయి. ఉద్యమంలో విశాఖపట్నానికి చెందిన 12 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లో ఇంకో 20 మంది చనిపోయారు. ప్రాణ త్యాగాలతో ఆ ఉద్యమం విజయవంతమైంది.

 

ప్రధానుల్లో లాల్ బహద్దూర్ శాస్త్రి హయాంలో ఉక్కు ఫ్యాక్టరీ  ప్రతిపాదన వచ్చింది. ఇందిరాగాంధి  శంకుస్థాపన చేశారు. పివి నరసింహారావు  జాతికి అంకితం చేశారు. మన్మోహన్ సింగ్ విస్తరణ పథకాన్ని ఆరంభించారు. అప్పటి రష్యా (యూఎస్ ఎస్ ఆర్) ఫ్యాక్టరీ నిర్మాణానికి సాంకేతిక సహకారాన్ని అందించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరి ప్రస్తుత వ్యవస్థాపక సామర్ధ్యం 63 లక్షల టన్నులు.

 

విశాఖ స్టీల్ ప్లాంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి రూ. 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే. విశాఖ స్టీల్ ప్లాంటు నుండి వివిధ పన్నుల వగయిరాల ద్వార ఇప్పటి వరకు దాదాపు రూ. 40 వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేరాయి.  అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు స్వంత ఇనుప గనుల్ని కేటాయించలేదు. 

 

విశాఖఉక్కును ప్రైవేటికరించాలని మొదటి నుండీ బిజెపి తపిస్తున్నది. వాజ్ పాయి ప్రభుత్వం విశాఖ ఉక్కు భవిష్యత్తును 2000లో బిఐఎఫ్ ఆర్ కు అప్పచెప్పింది. అప్పటి సియం చంద్రబాబు గట్టిగా ప్రతిఘటించడంతో ఆ ప్రమాదం తప్పింది. ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడానికి బిజెపి మరోసారి సిధ్ధపడింది.  ఈ మేరకు రిపబ్లిక్ డే రోజున కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం చేసింది.

 

గతంలోలా కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తేవడానికి అధికార వైసిపిగానీ, ప్రధాన ప్రతిపక్ష టిడిపిగానీ సిధ్ధంగాలేవు. ప్రైవేటికరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేగానీ తమది కాదన్నట్టు బిజెపి రాష్ట్ర నాయకులు బుకాయిస్తున్నారు. ఢిల్లోలో మకాం వేసి  కేంద్ర ప్రభుత్వం మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు జనసేన ఇంకో నాటకం ఆడుతోంది.

 

విశాఖ ఉక్కును కైవశం చేసుకోవాలనుకుంటుంటున్న ‘పోస్కో’  ఒక ప్రమాదకర పారిశ్రామిక సంస్థ. పోస్కోకు మనుషుల మీదకన్నా యంత్రాల మీద నమ్మకం ఎక్కువ. ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని అతిగా పెంచి కార్మికుల సంఖ్యను కుదించి భారీ లాభాలను అర్జించడం ఈ సంస్థ మార్కెట్ వ్యూహం. ఇది కార్మిక చట్టాలను గౌరవించదు, పర్యావరణ నిబంధనలనూ పాటించదు. పోస్కో అనుసరించే విచక్షణారహిత విధానాల వల్ల ప్రపంచ దేశాలు దాన్ని దూరంగా పెడుతున్నాయి. దాని విషయంలో సామాజిక దూరంలా పారిశ్రామిక దూరాన్ని పాటిస్తున్నాయి. ఒరిస్సా, ఛత్తీస్ గడ్, ఝార్ఖండ్, బెంగాల్ ప్రజలు పోస్కోను ఆయా రాష్ట్రాల నుండి తరిమికొట్టారు.

 

పోస్కో ఇండియా గ్రూపు సిఎండి సుంగ్ లయ్ చున్  గత ఏడాది అక్టోబరు చివర్లో ముఖ్యమంత్రి జగన్ ను కలిసినప్పుడే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఫైలు కదిలిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. పోస్కో, హ్యుందాయ్ ప్రతిధులతోపాటు భారత్ లో దక్షణ కొరియా రాయబారి 2018లో ఒక బృందంగా విశాఖపట్నం వెళ్ళి ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారనీ,  ఆ ఏడాది అక్టోబరు 22న ఆర్ ఐ ఎన్ ఎల్, ఎన్ ఎండిసి, కేంద్ర ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధులతో సమావేశమయ్యారని   కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగావున్న చంద్రబాబు హయాంలోనే కుట్ర ఆరంభం అయిందని వైసిపి నేతలు అంటున్నారు. 

 

అన్నింటికన్నా క్రూరమైన వాస్తవం ఏమంటే మనకున్న ప్రధాన పార్టీలన్నీ విదేశీ పెట్టుబడులకోసం అర్రులు చాస్తున్నాయి. సామ్రాజ్యవాద వలసవాదాన్ని ఆహ్వానిస్తున్నాయి. వీళ్లలో ఎవరికీ  ప్రైవేటికరణను అడ్డుకోవాలనే విధానమూ లేదు; శక్తీ లేదు.

 

ఒక మహా ప్రజాఉద్యమం మాత్రమే విశాఖ ఉక్కును రక్షించుకోగలదు. 

 

డానీ (ఏఏం ఖాన్ యజ్దానీ)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్

ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

 

జహా ఆరా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్

ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

 

హసన్ షరీఫ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-కన్వీనర్

ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

Comments

Popular posts from this blog

MTF - Charter Of Demands for Elections - 2019

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Muslim programme to confront the ‘Neo Manuism’