MTF Debate on Babri Masid and Ram Janam Bhoomi


MTF Debate on Babri Masid and Ram Janam Bhoomi
బాబ్రీమసీదు - రామజన్మభూమి వివాదంపై ఎంటిఎఫ్ చర్చ

Danny FaceBook Posts
A.M. KHAN YAZDANI DANNY
16 అక్టోబరు 2019
ఇతర మసీదులకు రక్షణ హామీ ఇస్తే, బబ్రీ మసీదు స్థలాన్ని హిందూ సమాజానికి వదిలివేయడమే ముస్లింలు చేయాల్సిన మంచిపని.

A.M. KHAN YAZDANI DANNY
17 అక్టోబరు 2019
గతంలోనూ ఇరుపక్షాలు కోర్టు తీర్పును శిరసావహిస్తామన్నాయి. అలహాబాద్ హైకోర్టు తీర్పు తరువాత ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు పరుగెట్టాయి.

A.M. KHAN YAZDANI DANNY
17 అక్టోబరు 2019
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత ముస్లింలు చేయడానికి చెప్పడానికీ ఏమీ వుండదు; తీర్పును శిరసావహించడం తప్ప.

A.M. KHAN YAZDANI DANNY
17 అక్టోబరు 2019
సుప్రీం కోర్టు తీర్పు రావడానికి ముందే బాబ్రీ మసీదు స్థలాన్ని హిందూ ధార్మిక సంస్థలకు ముస్లింలు షరతులతో ఇచ్చివేయాలనే నా అభిప్రాయం.

A.M. KHAN YAZDANI DANNY
18 అక్టోబరు 2019
కష్టాలు రావడం పెద్ద విషాదం కాదు; కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలియకపోవడం మహా విషాదం.

A.M. KHAN YAZDANI DANNY
18 అక్టోబరు 2019
తమ శక్తి గురించీ తమకున్న ఆదరణ గురించీ అతిగా ఆలోచించిన ఫలితంగానే విప్లవోద్యమాలు, అస్తిత్వవాద ఉద్యమాలు కుచించుకుపోయాయి.

A.M. KHAN YAZDANI DANNY
19 అక్టోబరు 2019
బేధ దండోపాయాలే కాదు; సామ దానాలు కూడా ఉపాయాలే.
నా ముస్లిం మిత్రులకు అవి అర్థం కావడం లేదు.

A.M. KHAN YAZDANI DANNY
19 అక్టోబరు 2019
నిర్ధిష్టంగా బాబ్రీ మసీదు వివాదానికీ, స్థూలంగా దేశంలోని ముస్లింల అభ్యున్నతికీ ఎవరి దగ్గర అయినా పరిష్కారం వుందా?

A.M. KHAN YAZDANI DANNY
20  అక్టోబరు 2019

బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టుతో సహా దేశంలోని ప్రతి న్యాయస్థానం ముస్లింలకు అన్యాయమే చేస్తూ వచ్చాయి.

A.M. KHAN YAZDANI DANNY
21  అక్టోబరు 2019

బాబ్రీ స్థలాన్ని హిందూ సమాజానికి ఇచ్చివేయాలనే సూచనలో మిత్రులు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కాకుండ తాత్కాలిక నష్టాన్నే చూస్తున్నారు.

Danny FaceBook Notes

గొప్ప విజయం కోసం ఒక అడుగు వెనక్కి
A.M. KHAN YAZDANI DANNY·TUESDAY, OCTOBER 22, 2019·2 Reads

            బాబ్రీ మసీదు స్థలాన్ని ముస్లిం సమాజం సుప్రీం కోర్టు సమక్షంలో కొన్ని షరతులతో హిందూ సమాజానికి అధికారికంగా ఇచ్చివేయాలనే నా సూచన మిత్రులు చాలామందికి నచ్చలేదు. వాళ్ళు నా సూచనలోని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని వీక్షించకుండ తాత్కాలిక నష్టాన్ని మాత్రమే చూస్తున్నారు.
            బాబ్రీ మసీదు సమస్య మొదట్లో ఒక గల్లీ వ్యవహారం. ఇప్పుడది దేశ సాంస్కృతిక వ్యవహారం. సంఘీయులు ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పన తమ లక్ష్యమని 1989లోనే ప్రకటించారు. వాటిల్లో మొదటిది నెరవేర్చుకున్నారు. రెండోది నెరవేర్చుకోవడం దాదాపుగా ఖాయం అయిపోయింది. మూడోదాన్ని  నెరవేర్చుకోవడానికి రంగం సిధ్ధం అయింది. రక్షణాత్మక స్థితిలో వున్న ముస్లిం సమాజం చేయగల గొప్ప పనేమిటీ అనేది ఇప్పుడు ప్రాణప్రద అంశం.
            లాహోర్ లోని షహీద్ గంజ్ గురుద్వారను శిక్కులకు అప్పగించడమేగాక ఆ కట్టడంలోని మసీదు చిహ్నాలను తొలగించడానికి కూడ పాకిస్తాన్ లో మెజార్టీగా వున్న ముస్లిం సమాజం ఉదారంగా వ్యహరించింది. ముహమ్మద్ ఆలీ జిన్నా సహితం ఈ ప్రతిపాదనకు అంగీకారాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి పరిస్థితి వర్తమాన భారత సమాజంలో లేదు.
రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ, హిందూత్వ శక్తులకు గుణపాఠం నేర్పాలనీ చాలా మంది జెనరిక్ మాటాలు మాట్లాడుతున్నారు. కొందరయితే ఉద్యమాలు, విప్లవాలు అంటున్నారు. దానికి తగ్గ వాతావరణం లేకపోవడమేకాదు; ఈ సలహాలు ఇచ్చేవారు సహితం తాము చెప్పే సూచనల్ని పాటించడానికి సిధ్ధంగానూ లేరు. ప్రస్తుతం అసలు ఎవరి దగ్గరా కార్యక్రమం లేదు.
            దేశంలో వాతావరణం ఎలా వుందంటే మతం వేరు మతతత్వం వేరు అనే అవగాహన చాలా మందికి లేదు. హిందూత్వవాదుల్ని విమర్శిస్తుంటే సాధారణ హిందువులు సహితం నొచ్చుకుంటున్నారు. సాధారణ హిందువుల్ని నొప్పించి ముస్లింలు సాధించగలిగేదీ ఏమీవుండదు. వినాశనాన్ని కోరి తెచ్చుకోవడంతప్ప.
            ముస్లిం సమాజం ఆవేశంతో రగిలిపోయే  సందర్భంకాదు ఇది. దౌత్య నీతిని ప్రదర్శించాల్సిన సమయం ఇది. నిజానికి ఆవేశంతో రగిలిపోయేవారు ఫేస్ బుక్ ను వదిలి బయటికి రావడంలేదు. తాను సన్నధ్ధంకాకుండా ప్రగల్భాలతో ప్రత్యర్ధిని రెచ్చగొట్టేవారు మూర్ఖులు. అలాంటి ప్రమాదం కూడ ఒకటి భారత ముస్లిం సమాజానికి లోపలి నుండి పొంచి వుంది.

శాంతి ఒప్పందమే ఒక మహత్తర విజయం
A.M. KHAN YAZDANI DANNY·TUESDAY, OCTOBER 22, 2019·1 MINUTE2 Reads

            బాబ్రీ మసీదు వివాదం సమసిపోయినంత మాత్రాన భారత ముస్లింల సమస్యలు పరిష్కారం అయిపోవు. పరిష్కారం కావల్సిన సమస్యలు అనేకం వున్నాయి. భవిష్యత్తులో అనేక కొత్త సమస్యలు సహితం పుట్టుకు వస్తాయి. ముస్లింలకు ఇప్పుడు కావలసింది ఒక నైతిక విజయం. అన్ని విధాలా దుష్ప్రచారానికి గురయిన ముస్లిం సమాజం ఎక్కడో ఒకచోట టర్న్ ఎరౌండ్ అవ్వాలి. దక్షణాయనం ముగిసి ఉత్తరాయనం మొదలు కావాలి. చరిత్ర సవాలు విసిరినపుడు ముస్లింలు గొప్ప ఉదారంగా వ్యవహరిస్తారనే గట్టి సంకేతం బయటికి వెళ్ళాలి.
            బాబ్రీ మసీదు మొత్తం రెండున్నర ఎకరాల స్థలాన్ని హిందూ సమాజానికే ఇచ్చేయాలనే ప్రతిపాదన కొత్తదేమీకాదు. ప్రవక్త ముహమ్మద్ (PBUH) గారి ఆచరణ నుండే ఈ ఆలోచన వచ్చింది. చారిత్రక హుదైబియా శాంతి ఒప్పందంలోని అన్ని అంశాలూ మక్కా ఖురైషీలకు అనుకూలంగా వుండినాయి. ఇస్లాం ఉద్యమకారులకు సానుకూలంగా వున్న అంశాలు దాదాపు శూన్యం. చివరకు ముహమ్మద్ (PBUH) గారిని ఆ ఒప్పందంలో ఏమని సంభోదించాలి అన్న విషయంలోనూ పేచీలొచ్చాయి. వారిని ప్రవక్త అని పిలవడానికి మక్కా ఖురైషీలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఆ ఒప్పందాన్ని సంతోషంగా అంగీకరించి ఎంతో ముందు చూపును ప్రదర్శించారు ప్రవక్త ముహమ్మద్.
            ఆ చారిత్రక సందర్భంలో ముస్లిం సమూహాన్ని మక్కా ఖురైషీలు గుర్తించి వారితో ఒక ఒప్పందాన్ని చేసుకోవడమే ఒక విజయం. హిందూ ముస్లీం సమాజాలమధ్య ఒక ఒప్పందం జరగడమే ఇప్పుడు ఒక మహత్తర అంశం. ఎన్నింటిని వదులుకున్నా శాంతి ఒప్పందమే ఒక విజయం.  ఇప్పుడు ముస్లిం సమాజానికి కావలసింది అలాంటి దృక్పథం.
హిందూ సమాజం శ్రీరాముని పేరిట కట్టుకునే కొత్త మందిరానికి పక్కలోనో, దగ్గరలోనో బాబ్రీ మసీదు నిర్మించాలనే ప్రతిపాదన కూడ సరైనది కాదు.  అయోధ్య  పట్టణంలోనే హిందూ సమాజం సహకారంతోనే మరో మసీదు నిర్మించుకోవచ్చు.
            ఇప్పటి సామాజిక వాతావరణం చాలా విషాదకరంగా వుంది. పౌర ఉద్యమాలు, న్యాయపోరాటాల పాత నిర్వచనాలు మారిపోయాయి. వాటి మీద ప్రజల స్పందనల తీరూ మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ అత్యాచారాల్ని ఎవరయినా ఖండిస్తుంటే సాధారణ హిందూ సమాజానికి కోపం వస్తోంది. ముస్లింలు రాజకీయ యుధ్ధం చేయడానికి ముందు సాధారణ హిందూ సమాజపు సానుకూలతను పొందాల్సిన అవసరం ఒకటుంది.




జహా ఆరా, కో-కన్వీనర్, MTF
ప్రతిపాదన
22 అక్టోబరు 2019

బాబ్రీమసీదు - రామజన్మభూమి వివాదంపై ముస్లిం థింకర్స్ ఫోరం ఆలోచన, స్పందన, విమర్శ, కార్యాచరణ పరిధి పరిమితి కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాను. మిత్రులు ఆలోచించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తాను.  

1.             రాజ్యాంగ ఆదర్శాలు, దౌత్యపరంగా చేసుకున్న ఒప్పందాలు, అంతర్జాతీయ అవగాహనలు, విధానాలను కేంద్ర ప్రభుత్వం అడ్డంగా వుల్లంఘిస్తున్నది
2.             ఆర్టికల్ 370 రద్దు దీనికి తాజా ఉదాహరణ.
3.             కేంద్ర ప్రభుత్వ కుట్ర, దాడి ముస్లింల పైననే అన్నది నిరాకరించలేని వాస్తవం.
4.             కాశ్మీరీ ముస్లింలను భయపెట్టి, వారి మానవ హక్కుల్ని అణగదొక్కుతోంది.
5.             దేశంలో ముస్లిం సమాజాన్ని మానసికంగా కుంగదీసి, న్యూన్యతా భావానికి గురిచేసి, నిస్సహాయులుగా నిలబెట్టి ఒక ఘన కార్యాన్ని సాధించినట్టు ప్రచారం చేస్తున్నది.
6.             హిందుత్వశక్తులు, నయా హిందుత్వ మేధావులు, జాతియోన్మాద దేశ భక్తులు, సంఘపరివారం మొత్తం ఈ ప్రచారంలో భాగం.
7.             ఇది భారత ముస్లింల మీద జరుగుతున్న దుష్ప్రచార దాడి.
8.             కేంద్ర ప్రభుత్వం నిబంధనలు, విలువల్ని అతిక్రమించి ఫెడరల్ వ్యవస్థ మీద  సాగిస్తున్న దాడిని మానవ హక్కుల పరిరక్షణ  కోణంలో  తిప్పికొట్టాలి.
9.             ముస్లింల  పేరు ఎత్తకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టి తీరాలి.
10.        అయోధ్య వివాదాన్ని ఒక  సివిల్ లిటీగషన్ గా మాత్రమే చూడాలి. అంతకు మించిన ప్రాధాన్యతను దానికి ఇవ్వ కూడదు. 
11.        ముస్లింలు సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తాం అనాలి.
12.        ఒకవేళ సుప్రీం కోర్టు  తీర్పు ముస్లింలకు వ్యతిరేకంగా వస్తే దాన్ని కేస్ మెరిట్స్  మీద పరిశీలించాలి.
13.        జ్యూడిషల్ మైండ్ వెనుక ఉన్న హిందుత్వ ఐడియాలజీ మీద, మైనారిటీల ప్రయోజనాలను కాపాడలేని రాజ్యాంగ వ్యవస్థల మీద విమర్శలు ఎక్కుపెట్టి వారిని దోషులుగా ప్రచారం చేయాలి.
14.        బాబ్రీ మస్జీద్ కూల్చివేతకు కారకులు అయినవారిని క్రిమినల్ లా ప్రకారం ఇంతవరకు శిక్షించలేకపోవడాన్ని, మన సంస్థ అన్ని మాధ్యమాల్లో చర్చకు పెట్టి ప్రభుత్వాన్ని దోషి చేయాలి....
15.        రాజీ గానీ, మసీదును వదులుకోవడం అనే బహిరంగ ప్రతిపాదన గాని చేయకూడదు.
16.        సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ముస్లింలు బహిరంగంగా ఎలాంటి కామెంట్లూ చేయవద్దు.
17.        ఒకవేళ సుప్రీంకోర్టు ముస్లింలకు వ్యతిరేకంగా వస్తే దానీ మీద ముస్లిం దృక్పథం నుండి వ్యూహాత్మకంగా విమర్శలు పెట్టాలి.
18.        పోరాటాలు, ఉద్యమాలు చేసే స్పృహ, అవగాహన, స్థైర్యం, పరిణితి, చైతన్యం,  స్థాయి వర్తమాన ముస్లిం సమాజానికి లేవు. వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలూ ముస్లింలు చేయరు.
19.        సోషల్ మీడియాను, ఇళ్ళను దాటి బయటికి రానివారు, రావాలనే ఆలోచనలూ లేనివారు పోరాటాలు చేయలేరు.
20.        గతంలో ముస్లింలపై దాడులకు, ఊచకోతలు జరిగినప్పుడు స్పందించి, వ్యతిరేకించిన సమూహాలు ఇప్పుడు లేవు.
21.        ముస్లిం సమాజం ఆత్మవిమర్శ చేసుకోకపోయినా, చేసిన తప్పులకు పశ్ఛాత్తాపాన్ని ప్రకటించకపోయినా, అంతర్గత ప్రక్షాళనను చేపట్టకపోయినా, సాంఘీక ఆర్ధిక విద్యా రంగాల్లో చొరవ చూపి ఎదగక పోయినా, రాజకీయ ప్రాతినిథ్యాన్ని క్షేత్ర స్థాయి నుండి నిర్మించక పోయినా, సమస్త రంగాలలో మహిళల ప్రాతినిథ్యాన్ని  పెంచకపోయినా కష్టకాలంలో అల్లాహుతాల కూడ తన సహాయాన్ని మనకు పంపడు.
22.        ముస్లింలు కనీసం ఇప్పుడైనా దీన్ దారీ జీవితానికీ, దునియాదారీ జీవితానికీ   తేడా తెలుసుకోవాలి. సామాజిక జీవితాన్ని కొనసాగిస్తే ఇమాన్, ఆఖిరియత్ పొందలేము అన్న అపోహల నుండి బయటపడాలి.
23.        చైతన్యం ఉన్నవారిని కదిలించగలం ముస్లిం సమాజం పై ప్రేమ, తపన లేనివారినీ అచేతన, నిసత్తువల్లో మునిగిపోయిన వారినీ మనం ఎలాగూ సమీకరించలేము.
24.        రాత్రికిరాత్రి అద్భుతాలు జరిగిపోతాయని ఆశించకుండ ఎవరి స్థాయిలో ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు పనిచేయాలి.

MTF కన్వీనర్ డానీ నోట్ :
22 అక్టోబరు 2019

1.             ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మత్రి అమిత్ షాల దూకుడు, సుప్రీం కోర్టును  కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తున్న తీరును చూస్తుంటే బాబ్రీ మసీదు- రామమందిరం టైటిల్ స్యూట్ లో తీప్రు ఏవిధంగా వుండబోతున్నదో ఊహించడం కష్టం ఏమీ కాదు.
2.             అలహాబాద్ హైకోర్టు (లక్నో బెంచ్) 2010లో వివాదాస్పద 2.7 ఎకరాల స్థలాన్ని ముగ్గురు కక్షిదారులకు సమానంగా పంచింది.
3.             సుప్రీం కోర్టు అంత ఉదారంగా వుండకపోవచ్చు. మొత్తం స్థలం నిర్మోహి అఖార, రామ్ లల్లా లదే అని తీర్పు చెప్పేసినా ఆశ్చర్యం ఏమీలేదు.
4.             సుప్రీం కోర్టు మీద  అనేకసార్లు అంతిమ విశ్వాసాన్ని ప్రకటించిన ముస్లిం సమాజం తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినా ఆమోదించక తప్పదు.
5.             తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందని ముస్లిం సమాజం వ్యతిరేకిస్తే   మన మీద అనేక రకాల దాడులు మొదలవుతాయి.
6.             ముస్లింలు సుప్రీకోర్టును కూడ గౌరవించరు అంటూ దుష్ప్రచారం మరింతగా వుధృతంగా సాగుతుంది.
7.             ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు సున్నీ వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా వచ్చినా ముస్లింలు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు.
8.             ముస్లింలు తెగించి ఆ స్థలం లోనికి ప్రవేశిస్తే దేశవ్యాపితంగా మరో గుజరాత్ జరుగుతుంది. “గుజరాత్ లో చేసి చూపించిందే దేశంలో చేసిచూపిస్తాం” అని వాళ్లు మొదటి నుండి అంటూనే వున్నారు.
9.             దేశంలోని మతతత్వవాదుల్ని ఎదుర్కొనే క్రమంలో మనం తరచుగా సాధారణ హిందూ భక్తుల నుండి కూడ  వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాము.
10.        యుధ్ధంలో ఎప్పుడూ ఒక శిబిరం మీద దాడి చేస్తున్నపుడూ మిగిలిన శిబిరాలను కలుపుకోవాలి.
11.        సంఖ్య రీత్య మనం అత్యధికులుగా వుండేలా చూసుకోవాలి.
12.        మైనార్టీలు మైనార్టీలుగానే వుంటూ రాజకీయ అధికారాన్ని సాధించలేరు.
13.        దళితులు సహితం తాము హిందువులమని భావిస్తున్న రోజులివి.
14.        మనం హిందూత్వ వాదులతో తలపడి గెలవడం మాట అటుంచి సమాజంలో మరిన్ని సమూహాలను శత్రువులుగా తయారు చేసుకుంటున్నాం.
15.        ఇన్ స్టాంట్ టిరిపుల్ తలాక్, ఆర్టికల్ 370  కేవలం ఆరంభం మాత్రమే.  రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి, ఎన్.ఆర్.సి, ఎన్.పి.ఆర్., డిటేన్షన్ క్యాంపులు వగయిరాలు చాలా వున్నాయి.
16.        ప్రజయాల బాటను వదిలి విజయాల బాటను పట్టాలంటే ముస్లింలు ఎక్కడో ఒకచోట ఆటను తమ చేతుల్లోనికి తీసుకోవాలి.   
17.        ఈ నేపథ్యంలో గుడ్ విల్ మేకింగ్ గా వుంటుందని ఒక ప్రతిపాదన చేశాను.
18.        సుప్రీం కోర్టు తీర్పు రాక ముందే కొన్ని షరతులతో అత్యున్నత న్యాయస్థానం సమక్షంలో ముస్లింలు ఒక శాంతి ఒప్పందం చేసుకుని అయోధ్యలో బాబ్రీ మసీదు స్థలాన్ని స్వఛ్ఛందంగా హిందూ సమాజానికి అప్పగించాలి.
19.        దౌత్యనీతి, శాంతి ఒప్పందాలు మనకు చరిత్రనిండా ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తాయి.
20.        వాళ్లు గతంలో అనేక సందర్భాల్లో మాట మీద నిలబడలేదని తెలిసినప్పటికీ మనం వారితో ఒప్పందాలు చేసుకోవాలి. 
21.        వాళ్ళు ఇకనైనా ఒప్పందానికి కట్టుబడతారనే ఆశ మనలో వుండాలి.
22.        ఒకవేళ వాళ్ళు మాట తప్పినా నైతిక బలం మనవైపు వుంటుంది. అదొక్కటే ఈ దశలో మనం ఆశించగలిగిన విజయం.
23.        ఈ విషయాన్ని నేను మన కో-కన్వీనర్ జహా ఆరా గారితో విశాఖపట్నంలో ఈ నెల 17నే చెప్పాను.  వారు కూడ నా ఆలోచన ఒక వున్నత స్థాయిలో వుందన్నారు. అయితే, దీనిని ముస్లిం సమాజం అంగీకరించకపోవచ్చన్నారు.
24.        గత నాలుగు రోజులుగా నేను నా అభిప్రాయాన్ని ఫేస్ బుక్ లో వ్యక్తం చేశాను.  
25.        మన కో-కన్వీనర్ అబ్దుల్ వాహెద్ గారికి కూడ నా ప్రతిపాదన నచ్చినట్టు లేదు.
26.        ఈలోగా జహ ఆరా గారు మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.
27.        సభ్యులందరూ రెండు దృక్పథాల మీద  చర్చ జరిపి ఒక నిర్ణయానికి రండి. దానినే ముస్లిం థింకర్స్ ఫోరం విధానంగా ప్రకటిద్దాము.

ఇక విస్తృతంగా చర్చించండి.
జజకల్లా ఖైర్
మీ అందరి

డానీ

MTF కన్వీనర్ డానీ నోట్ :
23 అక్టోబరు 2019

మిత్రులారా! ఈ దశలో JAHA Ara గారి అభిప్రాయాలతో గానీ, Wahed Abd అభిప్రాయాలతోగానీ విభేధించ దలచలేదు.  

ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు మూడే.

మొదటిది; ఎంటిఎఫ్ లక్ష్యం మతసామరస్యం అని బయటి ప్రపంచానికి గట్టి సంకేతాలు ఇవ్వడం.
రెండవది; ఎంటిఎఫ్ లో అంతర్గత ప్రజాస్వామ్యం అద్భుతంగా వుందని బలంగా నిరూపించడం.
మూడవది; మహిళల అభిప్రాయానికి ఎంటిఎఫ్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడం.

మిగిలినవాళ్ళు అందరూ ఈ చర్చలో చురుగ్గా పాల్గొనండి. మీ భావాలను వ్యక్తం చేయడానికి ఇది ఒక మహత్తర అవకాశం. సద్వినియోగం చేసుకోండి.

జజకల్లా ఖైర్
మీ అందరి

డానీ

ఖాలిదా పర్వీన్ , కో-కన్వీనర్, MTF
23 అక్టోబరు 2019

I agree with # Dani bhai


అబ్దుల్ వాహెద్ , కో-కన్వీనర్, MTF
ప్రతిపాదన
23 అక్టోబరు 2019

డానీ గారు, జహాం ఆరా గారు ఇద్దరి అభిప్రాయాలు చదివిన తర్వాత ...

1.             బాబరీ మస్జిద్ వివాదం విషయంలో గుడ్ విల్ జశ్చర్ అనేది ఇప్పుడు కాదు... అద్వానీ కాలంలో కూడా వచ్చింది అప్పుడు అద్వానీ దానిపై కనీసం రెస్సాండ్ కూడా కాలేదు... అంటే పరిష్కారం అనేది వాళ్ళు కోరుకోవడం లేదు.
2.             ఇప్పుడు సుప్రీంకోర్టు తుది తీర్పు దశకు చేరుకున్న తర్వాత పరిస్థితి ఏమిటంటే – తీర్పు వారికి అనుకూలంగా రావచ్చనే అభిప్రాయం బలంగా ఉంది. మరోవైపు తీర్పు వ్యతిరేకంగా వచ్చినా అక్కడ స్థలాన్నీ మస్జిదు కోసం స్వాధీనం చేసుకునే పరిస్థితి లేదు. అంటే తీర్పు ఎలా వచ్చినా ఫలితం ఒక్కటే.
3.             ఈ పరిస్థితిలో గుడ్ విల్ జశ్చర్ కి గుర్తింపు ఉందా, విలువ ఉందా ... అసలు గుడ్ విల్ జశ్చర్ దేని కోసం. హిందూ ముస్లిం సముదాయాల మధ్య సామరస్యం కోసమా లేక ఈ సమస్య పరిష్కారం కోసమా? అసలు ఈ సమస్య ఎందుకు ఇంతకాలం కొనసాగింది? ఈ ప్రశ్నలు ఆలోచించాలి.
4.             ఈ సమస్య కొనసాగడానికి కారణం దేశ రాజకీయాలు. రాజకీయంగా ఎదగడానికి ముస్లిములను విలన్లుగా చిత్రీకరించడం దగ్గరి దారి, ముస్లిములను లక్ష్యంగా చేసుకుంటే అధికారం లభిస్తుందన్నది రుజువైయ్యింది. ముస్లిములను ఎంతగా అణిచివేశామో చూడండని చెప్పుకోడానికి ఉపయోగపడే అనేక నిర్ణయాలు ఇటీవల మన ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ... మరో దారి లేని నిస్సహాయస్థితిలో ముస్లిములు చివరకు గుడ్ విల్ జశ్చర్ పేరుతో అణగిమణిగి పడి ఉంటామని ఒప్పుకునేలా చేశాం అని చెప్పుకునే అవకాశం ఇవ్వడమే అవుతుంది.
5.             మరో ముఖ్యమైన విషయం... సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జరిగిన పరిష్కారం చరిత్రలో నమోదవుతుంది. వాదనలు, తీర్పు ఇవన్నీ కొన్ని తరాల తర్వాతి చరిత్ర కూడా నమోదు చేస్తుంది. భారతచరిత్రలో ఏం జరిగిందో అప్పటి తరాలకు తెలియాలి. మధ్యలో గుడ్ విల్ జశ్చర్ పేరుతో కలుగజేసుకుంటే చరిత్ర ఇదే విషయాన్ని నమోదు చేస్తుంది. స్వయంగా వాళ్ళే ఇచ్చేశారన్నదే నమోదవుతుంది. కోర్టు నిర్ణయంగా నమోదు కాదు. మానవ నాగరికతలు, జయాపజయాలు కేవలం కొన్ని దశాబ్దాల్లో నిర్ణయమయ్యేవి కావు. ఒక సుదీర్ఘకాలం గడిచిపోవచ్చు. కాబట్టి చరిత్రలో నమోదయ్యేది ఏమిటన్నది మనం దృష్టిలో ఉంచుకోవాలి.
6.             చరిత్ర కూడా వారే రాస్తారనేది నిజమే. అయినా చరిత్రను సరయిన పర్స్ పెక్టివ్ లో రాసేవాళ్ళు కూడా ఉంటారని మరిచిపోవద్దు.
7.             ఇప్పుడు సమస్య కేవలం బాబరీ మస్జిదు కానే కాదు. ఇటీవల ట్విటరులో ముస్లిములందరినీ లక్ష్యంగా చేసుకుని ప్రచారం జరిగింది. అందరినీ బహిష్కరించాలనే ప్రచారం. బాహాటంగానే మతవిద్వేష ప్రసంగాలు జరుగుతున్నాయి. చట్టప్రకారం నిజానికి కేసులు నమోదు కావాలి. కాని జరగడం లేదు. ఈ వాతావరణంలో సమస్య మస్జిదు కానే కాదు. ముస్లిములను లక్ష్యంగా చేసుకున్న వాతావరణంలో కూడా చాలా మంది లౌకిక విలువలు, సామరస్యం గురించి మాట్లాడేవారున్నారు. వారిని మరిచిపోరాదు. అలాంటి వారెవరైనా సమస్య పరిష్కారానికి ఇలాంటి గుడ్ విల్ జశ్చర్ గురించి ప్రతిపాదించి ఉన్నట్లయితే అప్పుడు ఆలోచించే ఆస్కారముండేది. కాని అలా జరగలేదు. ఎందుకంటే వారికి కూడా తెలుసు, సమస్య మస్జిదు కానేకాదు. దేశరాజకీయాల్లో విద్వేషం పునాదిగా అధికారం అందుకునే వాతావరణం ఏర్పడింది. అదే సమస్య.
8.             ఈ సమస్య పరిష్కారానికి నా దృష్టిలో ఉన్న మార్గం... ప్రధాన జీవనస్రవంతిలో ముస్లిములు నిర్మాణాత్మక పాత్రతో ముందుకు సాగాలి. వివిధ రంగాల్లో ఇతర సముదాయాలతో కలిసి పనిచేయాలి. కొత్త విద్యావిధానం విషయంలో కాని, ఆర్ధిక వ్యవస్థ విషయంలో కాని, స్టార్టప్స్ విషయంలో కాని, ఇంకా ఇలాంటి చాలా చాలా రంగాల్లో తమ ఉనికి ప్రాముఖ్యాన్ని చాటి చెప్పగలగాలి. భారత చరిత్రలో మతసామరస్యానికి సంబంధించిన వివిధ సంఘటనలను ప్రచారంలో పెట్టాలి. మతసామరస్యం, సోదరభావాల వాతావరణం పెంచడానికి ప్రయత్నించాలి. దళిత, బడుగు బలహీనవర్గాల సమస్యలపై పోరాడ్డమే కాదు, అవసరమైతే అగ్రవర్ణాలకు సంబంధించిన సమస్యలైనా సరే వారితో పాటు కలిసి పనిచేయాలి.
9.             దేశంలో సమస్యలు లేని సముదాయాలు ఏవీ లేవు. అన్ని సముదాయాలకు వారి వారి సమస్యలున్నాయి. రాజకీయ, ఆర్ధిక రంగాల్లో పలుకుబడి కలిగిన వారు కొంతమంది ఉన్నంత మాత్రాన ఆయా సముదాయాల ప్రజలందరూ సమస్యలు లేకుండా లేరు. ప్రతి సముదాయం సమస్యల విషయంలో మన ప్రతిస్పందన ఉండాలి.
10.        చివరిగా ... మానవ విలువలే ప్రధానంగా పనిచేయడం మాత్రమే ఇప్పుడైనా.. ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుంది.

ఫయాజ్ అలీ, కో-కన్వీనర్, MTF
23 అక్టోబరు 2019

1.             మైనార్టీలను విలన్లుగా చిత్రీకరిస్తూ అదే ఘనకార్యంగా చూపెడుతూ దేశాన్ని నాశనం చేస్తున్నారనే విషయం మెజారిటీ ప్రజలు తెలుసుకోవాలి.
2.             ప్రస్తుత పాలకుల విధానాలతో ముస్లిమ్స్ కంటే హిందువులు ఎక్కవ నష్టపోతున్నారని విషయం హిందువులు గమనించే రోజులు వస్తాయి.
3.             ఏదైనా evm లు కరెక్టుగా పనిచేస్తేనే....


Shafi Aha Med Mohammed, MTF
23 అక్టోబరు 2019

Sir.. good morning..
1.             ఈ రెండు చదివాను.. మీ ప్రతిపాదన సరళంగా ఉంది.. జహార గారి ప్రతిపాదన.. కొంత జఠిలం అనిపించింది.. మరో మారు చదువుతాను..
2.             ప్రాధమికంగా మీ ప్రతిపాదనలో నేను సింహభాగం సానుకూలం.. మరో మారు రెండింటిని పరిశీలించి మీతో మాట్లాడుతాను..
3.             ముస్లిం సమాజ సహజ యోచనకు భిన్నంగా సోషల్ మీడియాలో మీరు ధైర్యంగా మీ అభిప్రాయాలను వెల్లడించడం అభినంద నీయం..

హసన్ షరీఫ్, కో-కన్వీనర్, MTF
ప్రతిపాదన
23 అక్టోబరు 2019

1.      @A.m. Khan Yazdani Danny  and @Wahed Abd  bhai la ఆలోచన కోణం ఒక్కటే అని నాకు అర్థం అవుతుంది.
2.      కాకపోతే కొంత మెలిక ఏమిటి అంటే @Wahed Abd  bhai good will  కాకుండా దగ్గర దగ్గరగా అలాంటి పరిష్కారాన్నే కోరుతున్నారు.
3.       మళ్ళీ ముస్లిం సముదాయం ఎదగాలి అంటున్నారు, నిజమే మనం ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ కలుసుకున్నాం.
4.      బాబ్రీ masjid విషయంలో మనం prestige కీ వెళ్ళడం వలన ప్రయోజనం ఏమీ ఉంటుంది? మనం ఎవరిని నమ్మి పోరాడగలము? సుప్రీం కోర్టు కూడా చేతులు ఎత్తేసి సంధి కుదిర్చే పని పెట్టుకుంది. మనం ఎక్కడికి వెళ్లి న్యాయం కోసం హక్కు కోసం అర్జి పెట్టుకొగలం?
5.      ఒకవేళ తిరగబడి నిలబడగలదా మన సమాజం? మనం రెండో తరగతి పౌరులుగా ఐన కనీసం ఉనికి ఉంది అని సంతోష పడటం తప్పించి ఏమి చేయలేం.
6.      ఒక వేళ ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే చెప్పండి చేద్దాం.
7.      మొన్న కమలేశ్ తివారీను చంపింది ఎవరో ప్రపంచం మొత్తం అర్థం అయినా పోలీస్ మాత్రం ఎవరిని దోషులు చేసింది? ట్విట్టర్లో ఎందుకు ముస్లింల మీద అంత అవమానం జరిగింది. వాస్తవాలు తెలియని వాళ్ళు  అదే నిజం అనుకుంటున్నారు.
8.       కమలేశ్ తివారీను  తల్లి చెప్పినా, అక్కడ జరిగింది కళ్ళకు కట్టినట్లు ఎవరైనా చూపించినా ఇది ముస్లిమ్ ల కుట్ర అంటారే గాని నిజం అని నమ్మరు. ఇదే ప్రస్తుత కాల పరిస్థితి. నిజం న్యాయం ఏమీ అవసరం లేదు.
9.      కేవలం ఒక నింద, ఒక అబద్ధం చాలు; దేశంలో ఒక పెద్ద genocide అవ్వడానికి.
10.  దానికి బాబ్రీ మసీదు కారణం అవ్వకూడదు అని అనుకుంటున్న.
11. మనం ఎన్ని యుగాలు మాట్లాడుకున్న పరిష్కారం ఒక్కటే మానవతా వాదం.

Comments

Popular posts from this blog

MTF - Charter Of Demands for Elections - 2019

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Muslim programme to confront the ‘Neo Manuism’