On MTF supporting KCR in Telangana


Hyderabad
14th Decenber 2018

మిత్రులారా !

 On MTF supporting KCR in Telangana 

జాతీయ రాజకీయాల్లోనేగాక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ వచ్చే ఎన్నికల్లో MTF ఎలాంటి  వైఖరి అవలంబించాలనే విషయం మీద నవంబరు 4 నాటి విజయవాడ కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు  చేశాము. అవి మీకందరికీ తెలుసు.  ఆ తీర్మానాల మీద భిన్నాభిప్రాయం వున్న మైనార్టీ వర్గం కూడా సహజంగానే మన సంస్థలో వుంటారు. వాళ్లు తమ అభిప్రాయాల్ని సంస్థ అంతర్గత చర్చల్లో ఎలాగూ ప్రవేశపెడుతుంటారు. ఇతర సభ్యుల్ని  ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అది మన సంస్థలోని మైనార్టీల ప్రజాస్వామిక హక్కు. దానిని అందరూ గౌరవించాలి.

అయితే, బహిరంగ వేదికల మీద మాత్రం ప్రతి ఒక్కరూ ఎలాంటి మినహాయింపు లేకుండా సంస్థ అధికారిక విధానాలను మాత్రమే మాట్లాడాలి. ఈ నియమాన్ని ఎవరు వుల్లంఘించినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.

            తెలంగాణలో టిఆర్ ఎస్ కు మద్దతు పలకాలనేది MTF నిర్ణయం. మనం మద్దతు పలికిన పార్టియే అధికారంలోనికి వచ్చింది. అది ఆనందం. కేసిఆర్ మీద MTF  చేసిన తీర్మానాన్ని పునఃపరిశీలించాలని ఎవరయినా ఎప్పుడయినా మన గ్రూపు చర్చల్లో కోరవచ్చు.  మన ఇనాయతుల్లా గారికి  అలాంటి అభిప్రాయాలు వున్నాయి. కానీ బహిరంగ వేదికల మీద మాత్రం అలాంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేయవద్దు.  సంస్థాగత క్రమశిక్షణను పాటించండి.

            కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ముస్లింలకు ఒక్క స్థానమైనా  కల్పించాలని మనం ముఖ్యమంత్రి చంద్రబాబును కోరాం. వారు చాలా ఆలస్యంగానే అయినా మన డిమాండ్‍ మీద స్పందించారు. ఎన్ ఎం డి ఫరూఖ్ ని మంత్రిగా  నియమించి ఆరోగ్య, వైద్య శాఖ కేటాయించారు. అప్పుడు చంద్రబాబుకు ముస్లిం సమాజం ధన్యవాదాలు చెప్పడం ఒక మర్యాద. అయితే, ఫరూఖ్ కు మంత్రి పదవి ఇచ్చాక అనేక మంది ముస్లింలు చంద్రబాబును విమర్శిస్తూ, ఎద్దేవ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అంటే మనం ముందుకు తెచ్చిన డిమాండ్‍ మీద మనకే ఎలాంటి గౌరవం లేదనే అర్ధం వస్తుంది. ఇవి ఆకతాయి పనులు. ఇలాంటివి MTF  సభ్యులు చేయకూదని నా మనవి.  దాని అర్థం చంద్రబాబును అస్సలు విమర్శించ రాదని కాదు. ముఖ్యమంత్రిని ఎప్పుడు ఏ విషయాల్లో విమర్శించాలి, ఎప్పుడు ఏ కోరికలు కోరాలి, ఎప్పుడు ఏ విషయంలో ధన్యవాదాలు చెప్పాలీ అనేవి విజ్ఞతకు సంబంధించిన అంశాలు.

            తెలంగాణలో మన సభ్యులొకరు “ఆంధ్రా వెలమలు” అంటూ కేసిఆర్ పాలనను బండ భాషలో తిట్టారు. ఆ సభ్యుడు తప్పులేకుండా తెలుగులో ఒక్క వాక్యం కూడా రాయలేడు. (“గత నాలుగు సంవత్సరాల్లో ఆంధ్ర వె లం మా కుటుంబానికి చెందిన తెలంగాణను గత నాలుగు సంవత్సరాల పాలనలో ఇరవై లక్షల కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించకుండా, గత ఎన్నికలలో చేసిన అన్ని వాగ్దానాలను కూడా తిరస్కరించింది”- ఇదీ వారి తెలుగు వాక్యం!). తెలుగే కాకుండా ఇంగ్లీషులోనూ  వారు చెలరేగిపోయారు.

తెలంగాణలో వెలమ – రెడ్డి కులాల మధ్య, ఆంధ్రప్రదేశ్ లో కమ్మ- రెడ్డి కులాల మధ్య ప్రత్యర్ధి భావనలు వున్నాయన్నది నిజమే. అంతేకాదు కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రల మధ్య కూడా ప్రాంతీయ విబేధాలున్నాయి. అది నిజమేగానీ, అదే అంతిమ సత్యం కాదు.

            అధికారంలో వాటాలు ఎలా పంచుకోవాలో పెత్తందారీ కులాలకు బాగా తెలుసు. కొంచెం తేడాలు వచ్చినపుడు వాళ్లు కిందివాళ్ళను దువ్వి ప్రాంతీయ  సెంటిమెంటునో, కుల సెంటిమెంటునో రెచ్చగొడుతుంటారు. వాళ్లు స్ప్షల్ మీడియాలో చెలరేగిపోతుంటారు.

ఏపీలో జగన్ చుట్టూ చేరిన రెడ్డి సామాజికవర్గం తన మీద గుర్రుగా వుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే వారు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. తెలంగాణలో రెడ్డి అభ్యర్ధిని  మఖ్యమంత్రి చేయడానికి కమ్మవాళ్ళు సహకరించాలనీ, ఏపీలో కమ్మ అభ్యర్ధిని మఖ్యమంత్రి చేయడానికి రెడ్లు సహకరించాలని ఇరువర్గాలు ఒక అంగీకారానికి  వచ్చాయి.  తెలంగాణలో రేవంత్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం ఒప్పందం  లక్ష్యం.   

            రెడ్ల మద్దతు మీద చంద్రబాబు తెలంగాణకు వచ్చారని కేసిఆర్ కు కూడా తెలుసు. ఎత్తుకు పైత్తుగా కేసిఆర్ ప్రజా కూటమి కన్నా ఎక్కువగా 37  సీట్లు  రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ శాసన సభ్యుల్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటి రెడ్లు.

            కమ్మవాళ్ళ ప్రభుత్వంలో రెడ్లు వుండరా? రెడ్ల ప్రభుత్వంలో కమ్మవాళ్ళు వుండరా? వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కమ్మ సంతుష్టీకరణ పథకాన్ని చేపట్టారు. నిమ్మగడ్డ (మాట్రిక్స్) ప్రసాద్, ఘట్టమనేని కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు తదితర కుటుంబాలకు మేళ్ళు చేసే పనుల్నే చేశారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి, చనుమోలు వెంకట రావు, పాలడుగు వెంకటరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాగంటి బాబు , దేవినేని నెహ్రు, లగడపాటి రాజగోపాల్, వసంత నాగేశ్వరరావు తదితరులు కాంగ్రెస్‍ నాయకులుగా ఒక హవా నడిపిన కాలం అది.  ఇప్పుడు చంద్రబాబు రెడ్డి సంతుష్టీకరణ పథకాన్ని చేపట్టినట్టు రేపు ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయినా  కమ్మ సంతుష్టీకరణ పథకాన్ని చేపట్టక తప్పదు. కేసిఆర్ గెలివగానే చేసిన తొలి ప్రకటన రెడ్డి కార్పొరేషన్ నెలకొల్పుతాననేది మనం మరచిపోకూడదు.

మనది ముస్లిం మైనారిటీల సంస్థ. రెండు రాష్ట్రాల్లో ముస్లింల సమస్యల్ని పరిష్కరించడమే  మన లక్ష్యం.  మన లక్ష్యానికి అవసరమైన మేరకే మనం ఇతర వివాదాల్లో పరిమితంగా జోక్యం చేసుకుంటాం. అంతేతప్ప, అదే మన సమస్య అయినట్టు చెలరేగిపోకూడదు. కందకు లేని దురద కర్రపెండలానికి దేనికీ? 

ఎన్ టి రామారావు 1994 ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించాక తొలిరోజు తనతో పాటు బషీరుద్దీన్ బాబూ ఖాన్ చేత మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు కేసిఆర్ కూడా ఆ సాంప్రదాయాన్నే కొనసాగించారు. తొలిరోజు తనతోపాటు మహమూద్ ఆలీని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయింది తనది ముస్లిం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని బలమైన సానుకూల సంకేతాలు ఇచ్చారు. కీలకమైన హోం శాఖను మహమూద్ ఆలీకి కేటాయించారు. గతంలో కూడా ఒకసారి ఎంఎం హాష్మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు హోం మంత్రిగా పనిచేసినట్టు గుర్తు.

మహమూద్ అలీని హోంనంత్రిగా నియమించడం పైన కూడా కొందరు ముస్లింలు సోషల్ మీడియాలో వ్యతిరేక కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి బాధ్యత లేని వ్యాఖ్యానాలు చేయవద్దు. ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఇవ్వలేదు అని విమర్శిస్తారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఇస్తే   హోం, ఆర్ధిక శాఖలకు ముస్లింలు పనికిరారా? అని అడుగుతారు. ఇస్తే ఇలా ఎద్దేవ చేస్తారు.  వీళ్ళు ఒక విధానం లేని  వినాశకారులు. అలాంటి వాళ్లను సరిదిద్దాలి. లేకుంటే బయటికి పంపించేయాలి.
ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలో చాలా మంది ఆలోచనాపరులకు కూడా తెలీదు. ప్రభుత్వాన్ని ఒక అపవిత్ర వ్యవస్థగా వాళ్లు భావిస్తారు.
ఒకప్పుడు తీవ్రవాదుల్లో  ఒక రకం అయోమయాన్ని  చాలా దగ్గరగా చూశాను.   ఇప్పుడు ముస్లిం సమాజంలో అలాంటి అయోమయం  ఎక్కువగా వుందనిపిస్తోంది.
పెత్తందారీ కులాలు దళితుల మీద దాడి జరిపినపుడు బాధితుల్ని పరామర్శించడానికి జిల్లా కలెక్టర్ రాకపోతే తెగ మండిపోయేవారు.  బాధితుల మీద ఇంత నిర్లక్ష్యమా అని విమర్శిస్తూ  "కలెక్టర్ రావాలి" అంటూ  ప్లకార్డులు పట్టుకుని చౌరాస్తాల్లో ధర్నాలు చేసేవారు. తీరా జిల్లా కలెక్టర్  బాధితుల్ని పరామర్శించడానికి వస్తే    ప్రభుత్వం మీద తమకు  నమ్మకం లేదని  నల్ల జెండాలు పట్టుకుని "కలెక్టర్! గో బ్యాక్" అంటూ నినాదాలు చేసేవారు. 
కారంచేడు సంఘటన జరిగిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు బాధితుల్ని పరామర్శించడానికి చీరాల వచ్చారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎన్ టి రామారావు బాధితుల్ని పరామర్శించడానికి వీల్లేదని ఆందోళనకారులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి తిరిగి వెళ్ళిపోయారు. మూడు నెలల తరువాత ఉద్యమం సద్దుమణిగిపోయింది. బాధితుల పునరావాస వ్యవహారం ముందుకు వచ్చింది. అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ నాగభైరవ జయప్రకాశ్ నారాయణ ఆ వ్యవహారాల్ని చక్కదిద్దారు. ఇందులో విశేషం ఏమంటే, జయప్రకాశ్ నారాయణ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. ఉద్యమకారులకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. పైగా ఎంత గొప్ప ఆవేశం వుంటే అంత గొప్ప ఉద్యమకారుడని ఒక కొలమానం వుండేది.
 "ఇంతకీ మీకు ప్రభుత్వ సహాయం కావాలంటున్నారా? వద్దంటున్నారా ?"  అని  వేంపెంట ఉద్యమం  (1998/99) సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ నన్ను అడిగారు. ఇటీవల గరగపర్రు ప్రతిఘటన సందర్భంగా నరసాపురం సబ్ కలెక్టర్ కూడా నన్ను అదే ప్రశ్న వేశారు.  బాధితుల కోసం మినీ ట్రక్కులో  బియ్యం పప్పులు పంపిస్తే ఆందోళనకారులు తిప్పికోట్టారట. ఆ తరువాత ప్రభుత్వ సహాయం అందలేదని ఆరోపణలు చేశారణ.
రిజర్వేషన్ల ఉద్యమం సాగినప్పుడూ అదే తంతు. మాకు కోటాలు వద్దు ఎర్రకోట కావాలి అనేవారు. ఇప్పుడు కోటా కావాలి, రేపు ఎర్రకోట కావాలి అనుకోవచ్చుగా.
మనం తక్షణ సమస్యల మీద ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతాం. దీర్ఘకాలిక సమస్యల మీద సమాజాన్ని మార్చడానికి ఉద్యమాలు చేస్తాం. రెండింటి మధ్య తేడా తెలీని వారూ ఏ ఒక్కటీ సాధించలేరు. పైగా రాయితీలను సాధించి తెచ్చిన వారి మీద నైతిక  ప్రమాణాలతో నిందలు వేస్తారు. ఇది అతివాద తప్పిదం తప్ప మరేమీకాదు.
ఆచరణాత్మకంగా  వ్యవహరించాల్సిన సందర్భాల్లో   నైతిక   భావోద్వేగాలతో  చెలరేగిపోతే మనం పొందాల్సిన వాటిని ఎన్నటికీ పొందలేము. 

ఎస్ టి, ఎస్ సి, బిసి, ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి కేసిఆర్ చేసే ప్రయత్నాల్లో MTF ఆయన వెంట వుంటుంది.  వారికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అయితే, తాను జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపి ముఫ్త్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా కేసిఆర్ అంటున్నారు. ఇది MTF పునః పరిశీలించాల్సిన అంశం. ఎందుకంటే,  రేపటి లోక్ సభ ఎన్నికల్లో బిజేపి వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ శిబిరానికి పడకపోతే, సంఘపరివారం మళ్ళీ లబ్దిపొంది, కేంద్రంలో యధాస్థితి కొనసాగే ప్రమాదం వుంటుంది.

ఇక మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద దృష్టి పెడదాం. డిసెంబరు 23 గుంటూరు సభకు అందరూ సిధ్ధంకండి. కో-కన్వీనర్లు ఎవ్వరూ మిస్ కావద్దు. గుంటూరు సభలోనే మనం మన కోర్కెల జాబితా (Charter of Demands) ను విడుదల చేస్తాము.

అల్లా హాఫీజ్

-         డానీ
కన్వీనర్
ముస్లిం ఆలోచనాపరుల వేదిక MTF
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 

Comments

Popular posts from this blog

MTF - Charter Of Demands for Elections - 2019

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Muslim programme to confront the ‘Neo Manuism’