MTF Supports UPA

MTF Supports  UPA 

ఐక్య ప్రగతిశీల  కూటమికి ఎంటిఎఫ్ మద్దతు
ముస్లిం ఆలోచనాపరుల వేదిక  గుంటూరు ప్రకటన,  నవంబరు 23, 2018

వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతో పాటూ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జమిలిగా జరుగనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగాయి కనుక అక్కడ సూటిగా ఒక రాజకీయ విధానాన్ని తీసుకోవడం ముస్లింలకు సులువయింది. కేసిఆర్ సాగించిన ముస్లిం ఫ్రెండ్లీ విధానాలవల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను సమర్ధించాలని ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటిఎఫ్) తీసుకున్న నిర్ణయం అన్ని విధాలా సరైనది.

తెలంగాణ ముస్లింలు  టిఆర్ ఎస్ ను సంపూర్ణంగా సమర్ధించే క్రమంలో కాంగ్రెస్ ను ఓడించారు. అదే వరుసలో టిడిపిని, కమ్యూనిస్టుల్ని కూడా ఓడించారు. ఈ క్రమంలో  బిజెపి ఐదు సిట్టింగ్ స్థానాల్లో నాలుగింటిని కోల్పోయి ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే నిలబెట్టుకుని ఘోరపరాజయం పాలైంది.  

సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ఎజెండాలే ప్రధానంగా వుంటాయి. తెలంగాణ సెంటిమెంట్ గల టిఆర్ ఎస్ ఒకవైపు  మిగిలిన పార్టీలన్నీ ఇంకో వైపు అనే సమీకరణతో ఈసారి తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. లోక్ సభ ఎన్నికల్లో సమీకరణలు మారిపోతాయి. వాటిల్లో జాతీయ ఎజెండా ప్రధానంగా వుంటుంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బిజెపి వెర్సస్ కాంగ్రెస్ ప్రాతిపదిక మీదనే ప్రధాన  పోటీ సాగుతుంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు రాగానే ఎంటిఎఫ్ కన్వీనర్ డానీ రాసిన వ్యాసంలో “ఎన్నికల్లో టిఆర్ ఎస్ ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తే, విజయానంతరం కేసిఆర్  చేసిన ప్రసంగం ఒక భూకంపంపాన్ని సృష్టించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలను కేసిఆర్ కొత్త విలువలతో పునర్ నిర్వచిస్తామన్నారు. ఉమ్మడి జాబితాను రద్దు చేస్తామన్నారు. ఎస్ టి, ఎస్ సి, బిసి, ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల ఫెడరల్ హక్కుల్ని కాలరాసే తీర్పులు ఇస్తే సుప్రీం కోర్టును కూడా అదుపు చేస్తామని ఒక హెచ్చరిక చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి రాజకీయ నాయకులు సుప్రీం కోర్టు మీద ఈ స్థాయి వ్యాఖ్యలు చేయడం భూకంపంకన్నా తక్కువేమీ కాదు. కేసిఆర్ నిర్ణయాన్ని ఆహ్వానిద్దాం. మద్దతునిద్దాంఅని రాశారు.

  అయితే, కేసిఆర్ ఏ పని చేసినా ఎంటిఎఫ్ సమర్ధిస్తుందనే సంకేతం వెళ్ళకూడదని అదే వ్యాసం చివరి పేరాలో ఒక హెచ్చరికను కూడా వారు చేశారు. “తాము జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపి ముఫ్త్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా కేసిఆర్ అంటున్నారు. ఇది పునః పరిశీలించాల్సిన అంశం. ఎందుకంటే,  రేపటి లోక్ సభ ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ శిబిరానికి పడకపోతే, సంఘపరివారం మళ్ళీ లబ్దిపొంది, కేంద్రంలో యధాస్థితి కొనసాగే ప్రమాదం వుంటుందిఅన్నారు.   

ఈ భూమ్మీద అఖండసత్యం అంటూ ఏదీ వుండనట్టే, అఖండ సమర్ధన కూడ ఏదీ వుండదు. ఎవర్ని ఏ మేరకు సమర్ధిస్తున్నాము; ఏ మేరకు వ్యతిరేకిస్తున్నాము అనే విషయంలో ఎవరికయినా సరే ఒక స్పష్టత వుండాలి. చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం రాజకీయ తప్పిదం అని ఎంటిఎఫ్ భావించింది. ఆమేరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, బాలకృష్ణ వ్యవహరించిన తీరునీ నిర్మొహమాటంగా విమర్శించింది.

 ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జమిలిగా జరుగుతున్నాయి కనుక అక్కడ ఎంటిఎఫ్ ఒక రాజకీయ విధానాన్ని తీసుకోవడం కొంచెం సంక్లిష్టమైన వ్యవహారంగా మారింది. రాష్ట్ర రాజకీయాలు ముఖ్యం అనుకుంటే ఒక విధానం ఏర్పడుతుంది. అలాకాకుండా,  దేశ రాజకీయాలు ముఖ్యం అనుకుంటే ఇంకో విధానం ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా వుండాలని మనం ఆశిస్తున్నామో దానిని బట్టి రాజకీయ  నిర్ణయాలు వుంటాయి.  

వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎంటిఎఫ్ ముందు అనేక ప్రశ్నలున్నాయి. కేంద్రంలో సంఘపరివారం పాలనను అంతం చేయడమా? ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వాన్ని ఓడించడమా? ఏది ప్రధానం? ఏది ద్వితీయం? మనం ప్రధానంగా ఓడించాల్సింది నరేంద్ర మోదీనా?  చంద్రబాబునా? వాళ్లిద్దరు ఇప్పుడు శతృశిబిరాల్లో వున్నారు కనుక అయితే నరేంద్ర మోదీ ద్వార చంద్రబాబుని ఓడించాలి. లేకుంటే చంద్రబాబు ద్వార  నరేంద్ర మోదీని  ఓడించాలి. కేసిఆర్ చెపుతున్న ఫెడరల్ ఫ్రంట్ ద్వార నరేంద్ర మోదీ శిబిరాన్నీ, కాంగ్రెస్-చంద్రబాబు శిబిరాన్నీ ఒకేసారి ఓడించడం ఇంకొక ప్రత్యామ్నాయం. 

తెలంగాణలో టిఆర్ ఎస్ ప్రభంజనాన్ని ఎంటిఎఫ్  ఆనందంగా ఆహ్వానించింది.  అయితే, జాతీయస్థాయిలో కేసిఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన అంత ఉత్సాహకరంగా లేదు.  గతంలోనూ కేసిఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేశారు. కోల్ కటా వెళ్ళి మమతా బెనర్జీని కలిసి వచ్చారు. వారి థర్డ్ ఫ్రంట్ మీద అప్పుడు ‘మోదీ బి-టీం’ అనే విమర్శలు వచ్చాయి. ఫెడరల్ ఫ్రంట్ అనేది రాష్ట్రాల ఎజెండాలకు సంబంధించిన వ్య్వవహారం. ఇందులో కీలక పరిమితి ఏమంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయాయి. ఇలాంటి  వాతావరణంలో ఫెడరల్ ఫ్రంట్ కు ఇతర రాష్ట్రాల నుండి చెప్పుకోదగ్గ మద్దతు వస్తుందని ఆశించడం కష్టం.

పొత్తిళ్ళ నుండే ఎంటిఎఫ్ సామాజిక దృక్పథం మతసామరస్యం; రాజకీయ దృక్పథం సంఘపరివారం, గోగ్రవాదులు లేని ప్రజాస్వామిక ప్రభుత్వం. హిందూ ముస్లిం సమాజాల మధ్య అనాదిగా సఖ్యత వుంటోంది. వుంది. వుంటుంది. సమస్యల్లా సంఘపరివారంతోనే; అది సృష్టిస్తున్న మతపరమైన ద్వేషభావాలు, మూకోన్మాదాలతోనే. కేంద్రంలో  బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏను ఓడించాలంటే దానికి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల శిబిరాన్ని బలపరచక తప్పదు.

కాంగ్రెస్ గానీ యూపిఏ శిబిరంలోని ఇతర పార్టీలుగానీ గొప్ప ముస్లిం అనుకూలురు కూడా ఏమీకాకపోవచ్చు.  అయితే, దేశంలో నరేంద్ర మోదీ సాగిస్తున్న అప్రజాస్వామిక, మతోన్మాద, నియంతృత్వ పాలనను అంతం చేయడానికి రాహుల్ గాంధీ సరసన వాళ్లంతా ఏకం అవుతున్నారు. భారతదేశంలో మత సామరస్యాన్ని కోరుకునేవారు, సామాజిక ప్రశాంతతను ఆశించేవారు, ప్రజాస్వామిక పాలనను నెలకొల్పామనుకునేవారు కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడుతున్న రాజకీయ శిబిరాన్ని బలపరచడం తప్ప మరో మార్గంలేదు.  ఆ శిబిరం పేరు యూపియే కావచ్చు మరొకటి కావచ్చు.

కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ను సమర్ధించడాన్నీ ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజం సంతోషంతో ఆహ్వానిస్తుంది. అయితే,  యూపియే సమీకరణాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలా వుంటాయనేది మాత్రం చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా ఇప్పటి టిడిపితో ముస్లింలు ఎలాంటి సంబంధాలను కొనసాగించాలి అనేది తేల్చడం అంత సులువుకాదు. 

  ప్రధాని మోదీ మోజులో వున్న నాలుగేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలను అన్ని రంగాల్లోనూ నిర్లక్ష్యం చేశారు. ముస్లిం సమాజాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేశారు. ముస్లింల హృదయాలలో ఆ గాయాలు ఇప్పటికీ పచ్చిగానే వున్నాయి. అయితే,  ఇప్పుడు సన్నివేశం క్రమంగా మారుతోంది. వ్యక్తిగత కారణాలవల్లనే కావచ్చుగానీ, జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోదీని రాజకీయంగా ఎదుర్కోవడానికి చంద్రబాబు సిధ్ధమయ్యారు. ఇది కూడా ఒక ఫెడరల్ పోరాటమే. ఈ ఘర్షణ రోజురోజుకూ తీవ్రం అవుతోంది. మోదీని ఫాసిస్టు, ఫ్యూడల్, మతోన్మాది, అసమర్ధుడు వంటి పరుష పదజాలంతో చంద్రబాబు ఘాటుగా విమర్శిస్తున్నారు. బీజేపి ప్రభుత్వాన్ని గద్దె దించితీరుతాం అని సవాళ్ళు విస్రుతున్నారు. అక్కడితో ఆగక కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సంఘపరివారానికి వ్యతిరేకంగా ఒక విశాల  శిబిరాన్ని నిర్మించే పనిలో నిమగ్నమై వున్నారు.

 మోదీ ప్రభుత్వం మీద చంద్రబాబు ధ్వజం ఎత్తింది ముస్లింల కోసం కాదు అన్నది ఎంత వాస్తవయో, మోదీ మీద ఆయన చేస్తున్న పోరాటంలో ముస్లింల ప్రయోజనాలు దాగున్నాయి అనేది అంతకన్నా వాస్తవం. కాగల కార్యాన్ని చంద్రబాబు నెరవేరుస్తుంటే ముస్లింలు ఎందుకు అడ్దుపడాలీ? ఇప్పటి ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేయాల్సిన అవసరం ముస్లింలకు మాత్రం  ఏముందనీ?

ఎన్నికల వాగ్దానాలని వుల్లఘించిన వారిని శిక్షించే చట్టాలు మనకు లేవు. ఎన్నికల్లో ఓడించడం ఒక్కటే మార్గం.  రాజకీయాల్లో నిన్న ఏమిటి అనేది గతం.  రేపు ఏమిటీ అనేది ఊహాగానం. ఈ రోజు ఎవరు ఏమిటీ అనేదే ముఖ్యం. ఎన్నిపరిమితులున్నా ఇప్పుడు మోది-బిజేపిల మీద బాహాటంగా పోరాడుతున్నది చంద్రబాబే.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబుకు ప్రధాన ప్రత్యామ్నాయం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. 2014 జమిలి ఎన్నికల్లో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడంతో గందరగోళం ఏర్పడి  ముస్లిం ఓట్లు చీలిపోయాయి. ముస్లిం ఫ్రెండ్లీగా వుండిన వైయస్ రాజశేఖర రెడ్డి వారసుడు అనే అభిమానంతో ఎక్కువ మంది ముస్లింలు జగన్ కు మద్దతు పలికారు. ఇప్పటికీ ఏపీ ముస్లింలలో పెద్ద భాగం జగన్ మీద అభిమానంతో వున్నారు. చిన్న భాగం మాత్రమే టిడిపితో వున్నారు.

చంద్రబాబు ఇటీవలి కాలం వరకు మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం కల్పించలేదన్నది ఒక బహిరంగ విషాదం. అయితే, జగన్ మాత్రం ముస్లింలకు చేసిందేమిటీ? వైసిపీ నియమించిన  పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా కమిటీలు 25లో ఒక్క ముస్లింకు అయినా అధ్యక్షునిగా అవకాశం ఇచ్చారా? వాటి మీద  పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ఆరు జోనల్ కమిటీల్లో ఒక్క ముస్లిం అయినా కన్వీనర్ గా వున్నారా? సమాధానం బిగ్ నో!

వైయస్ రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ కు రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన ప్రతిపక్షనేతగా వున్నారు. ఆ కాలంలో ఆయన కొలువులో షబ్బీర్ ఆలీ, మొహమ్మద్ జానీ వంటి ముస్లిం నాయకులు అనేకులు ఒక వెలుగు వెలిగారు. ఆ పరిస్థితి ఇప్పుడు వైసిపీలో వుందా? జగన్ సన్నిహితుల్లో కీలక స్థానంలో వున్న ముస్లిం ఎవరూ? అధికారంలోవున్న చంద్రబాబు ముస్లింలకు కల్పించిన మనోవేదనకన్నా ప్రతిపక్షనేతగావున్న జగన్ కల్పిస్తున్న మనోవేదన ఏమాత్రం  తక్కువది కాదు. అధికారంలో లేనపుడే ఇలావుంటే జగన్ ను ముస్లింలు నమ్మేదెలా? అందుకే నంద్యాల ఉపఎన్నికల్లో  ముస్లింలు జగన్ కు ఒక గుణపాఠం నేర్పారు.

జగన్ ప్రథాన లోపం రాజకీయాల్లో జాతీయ దృక్పథాన్ని ముసుగులో గుద్దులాటగా మార్చేయడం. మరోవైపు,  స్పష్టమైన జాతీయ దృక్పథం లేకుండా ముస్లింలకు మనుగడలేదు. కాంగ్రెస్ శిబిరంలో చేరే అవకాశాలు లేవు గనుక జగన్ బిజెపి శిబిరంలో చేరవచ్చు. జగన్ మీద ఇప్పటికే బిజెపికి రహాస్య మద్దతుదారు అనే ముద్రవుంది. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వారు అలాంటి సంకేతాలను బలంగా ఇచ్చారు. వారు ఫెడరల్ ఫ్రంట్లో సర్దుకోవచ్చని ఇప్పుడు కొన్ని సంకేతాలు వస్తున్నాయి. నిజానికి సీమాంధ్రా సెంటిమెంట్ కారణంగా ఫెడరల్ ఫ్రంట్ లోనూ జగన్ చేరలేరు.  తెలంగాణలో  టిడిపితో కాంగ్రెస్ కలవడం టిఆర్ ఎస్ కు లాభించినట్టు, ఆంధ్రప్రదేశ్ లో టిఆర్ ఎస్ (ఫెడరల్ ఫ్రంట్) తో వైసిపి కలిస్తే అది టిడిపికి పెద్ద లాభం అవుతుంది. జగన్ తటస్థంగా వుండాలనుకున్నా ముస్లింలు సమర్ధించరు. ముస్లింలకు కావలసింది నరేంద్ర మోదీతో తలపడేవారు; మతోన్మాద నియంతృత్వ పాలనను అంతం చేసేవాళ్ళు. కానీ ఢిల్లీలో బిజేపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని జగన్ చెప్పలేక పోతున్నారు. జగన్ తన తండ్రి వైయస్ లా కాంగ్రెస్ పార్టీలో చేరినా లేకుంటే యూపిఏ శిబిరంలో చేరినా ఏపీ ముస్లింలు మద్దతు ఇస్తారు

వైయస్ రాజశేఖర రెడ్ది కొడుకు గనుక ముస్లింలకు జగన్ మీద సానుభూతి వుండడం ఎంత వాస్తవమో, జాతీయ రాజకీయాల్లో జగన్ అనుసరిస్తున్న మోదీ అనుకూల విధానాలు ముస్లింలకు అత్యంత ప్రమాదకరమనేది కూడా అంతకన్నా వాస్తవం.

వర్తమాన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిణామాల్ని నవంబరు 4 నాటి విజయవాడ ఎంటిఎఫ్ కార్యవర్గ సమావేశం వివరంగా పరిశీలించింది. 

1.    వచ్చే ఎన్నికల్లో జాతీయంగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపిఏ) ని బలపరచాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

కొత్త సమీకరణాలనుబట్టి ఈ కూటమి పేరు మారినా మారవచ్చు కాంగ్రెస్ నాయకత్వంలోని ఏ రాజకీయ కూటమిని అయినా ఎంటిఎఫ్ సమర్ధిస్తుంది.

2.    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వాలని తీర్మానించింది.

3.    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – దాని మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వాలని తీర్మానించింది.


ఎన్నికల్లో గెలుపోటములు సహజం. సంఘపరివార రాజకీయ శిబిరానికి  వ్యతిరేకంగా కాంగ్రెస్ శిబిరాన్ని బలపరచాలనే ఎంటిఎఫ్ నిర్ణయం, రేపు ఎన్నికల బరిలో, ఓడిపోనూవచ్చు. కానీ, మతతత్వశక్తులకు వ్యతిరేకంగా పోరాడడాలనే విలువ నైతికంగా గెలుస్తుంది. సంఘపరివారంతో పోరాటాన్ని వదిలేసి ఏదో ఒక రాజకీయ పార్టీని  బలపరచాలనే సూచన రేపు ఎన్నికల బరిలో గెలవనూవచ్చు. కానీ మతతత్వశక్తులతో పోరాడాల్సిన బాధ్యతను విస్మరించినందుకు ఆ నిర్ణయం నైతికంగా ఓడిపోతుంది. సిధ్ధాంతాలను బలిపెట్టిన సంస్థ ఒక్క గెలుపు తరువాత చచ్చిపోతుంది. సిధ్ధాంతాలకు కట్టుబడిన సంస్థ వంద ఓటముల తరువాత కూడా బతికివుంటుంది. ఎంటిఎఫ్  కు సిధ్ధాంతాలు ముఖ్యం. 

ప్రకటన జారీ చేసినవారు
ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్,  ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 

ప్రకటన గుంటూరులో,  తేదీ  23 డిసెంబరు 2018

చిరునామా
Danny

32-13-52/105, Ramana Nagar,
Sunnapubhattila Center
Vijayawada – 520 010
Cell Phone : 90107 57776

Comments

Popular posts from this blog

MTF - Charter Of Demands for Elections - 2019

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Muslim programme to confront the ‘Neo Manuism’