Intellectuals – Social Workers and Political parties


హైదరాబాద్
15  Sept 2016

మిత్రులారా!

Subject : Intellectuals – Social Workers and Political parties

. ముస్లిం సమాజంలో ధార్మిక అంశాలను పట్టించుకోవడానికి జమాతులు, ఇమాంలు, మౌల్వీలు అనేకులు వున్నారు. రాజకీయార్ధిక సామాజిక వ్యవహారాల్లో మన సమాజపు స్పందన దాదాపు లేదన్నంత తక్కువగా వుంది.   ముస్లిం ఆలోచనా పరుల వేదిక (MTF)ను  ఆరంభించినపుడు వ్యవస్థాపకుల దృష్టిలో ఒక తక్షణ పరిమిత లక్ష్యం మాత్రమే వుంది మనది కవులు, రచయితలు  కళాకారులు, వృత్తినిపుణుల  వేదిక. కవితలు, కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, ఉపన్యాసాల ద్వార రాజకీయార్ధిక సామాజిక వ్యవహారాల మీద స్వీయ ముస్లిం సమాజంలో అవగాహనను పెంచాలనేది మన తొలి లక్ష్యం. మనది పటిష్టమైన నిర్మాణం వుండే సంస్థ కూడా కాదు.  ఒక  విశాల వేదిక మాత్రమే.

తొలి లక్ష్యాలను మనం  విజయవంతంగానే సాగించాము. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. అయితే ఈలోపు రాజకీయరంగం మనం ఊహించిన దానికన్నా చాలా  వేగంగా వేడెక్కింది.  మన రెండవ లక్ష్యంగా ఒక ప్రజా సంఘం నిర్మాణం, మన మూడవ లక్ష్యంగా రాజకీయ కార్యాచరణ మన కార్యక్రమంలో బలవంతంగా వచ్చి చేరాయి.

నిజానికి ప్రజా సంఘాన్ని, రాజకీయ పార్టీని మనమే  నిర్మించాల్సిన పని కూడా లేదు. భావ సారూప్యం గల  సంస్థలు, పార్టీలతో కలిసి పనిచేయవచ్చు అనేది  కూడా మనకున్న ఒక స్థూల అవగాహన. 

మన వేదిక కో-కన్వీనర్లుగా కార్యవర్గంలో వుంటున్న ఉమర్ ఫారూఖ్, హసన్ షరీఫ్, ఫయాజ్ అలీ, ఖాలిదా పర్వీన్ లకు వేరే ప్రజా సంఘాలున్నాయనీ, జహ ఆరా, అబ్దుల్ మతీన్, సయ్యద్ నబీ జిలానీ  తదితరులు వాళ్ళవాళ్ళ వృత్తి సంఘాల్లో చురుగ్గా పనిచేస్తున్నారనీ మనకు తెలుసు. అలాగే వివిధ రాజకీయ పార్టీల్లో అభిమానులుగానే గాక  క్రియాశీలంగా వున్నవారు కూడా మన వేదికలో వున్నారు. ఇంత మందిని కలుపుకుని ఒక విశాల వేదికగా మనం పనిచేస్తున్నాము.

మన మౌలిక ఎజెండా ఒక్కటే; భారత ముస్లింల భద్రత, అభ్యున్నతి. విద్యా, ఉపాధి, రాజకీయార్ధిక  రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు మన మౌలిక డిమాండ్లు. (ఏపీలో 8 శాతం, తెలంగాణలో 12 శాతం, జాతీయంగా 16 శాతం). ఎంఎల్ ఏలు, ఎంఎల్సిలు, మంత్రి పదవి, కార్పొరేషన్ల పదవులు, దుల్హన్ వగయిరా పథకాలు, షాదీఖానాలు వగయిరాలు మన ద్వితీయ డిమాండ్లు డిమాండ్లు. మనం సమిష్టిగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల మీద నిరంతరం ఒక రకం వత్తిడిని తేవడంవల్ల మాత్రమే వీటిని సాధించుకోగలం.  

గుంటూరు కేంద్రంగా ముస్లింల కోసం పనిచేస్తున్న సంస్థ MHPS. ఈ సంస్థ అధ్యక్షులు షేక్ ఖాజా వలితో నాకు దాదాపు పాతికేళ్ల అనుబంధం వుంది. ఈ ఏడాది మార్చి నెలలో ఖాజావలి  తనంతట తానుగా నాకు ఫోన్ చేసి MHPSకు గౌరవ అధ్యక్షునిగా వుండాలని కోరారు. నేను ఆనందంగా అంగీకరించాను. కొంత కాలం మన మధ్య సంబంధాలు బాగానే కొనసాగాయి. 

వైజాక్ MTF మీటింగ్ తరువాత  MHPS తీరులో కొంత తేడా వచ్చింది. ఒంగోలు MTF  సమావేశాన్ని ప్రకటించిన తరువాత విబేధాలు కూడా వచ్చాయి. “ఒంగోలు MTF సమావేశానికి వెళ్ళ వద్దు” అని  MHPS ప్రధాన కార్యదర్శి ఫారూఖ్ షుబ్లి ఒక ప్రచారాన్ని మొదలెట్టారు. మరోవైపు, మనం ఇతర అణగారినవర్గాలతో కలిసి పని చేయడం మీద ఖాజా వలీకి  కొన్ని  అనుమానాలున్నాయి. వారు ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పరోక్షంగా  రాశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో సూటిగా అడిగినా,  వ్యక్తిగతంగా  అడిగినా, Messenger Groupలో అడిగినా మనం వివరంగా సమాధానం చెప్పివుండేవాళ్ళం.  సంస్థాగత విధాన నిర్ణయ అంశాలను సహితం Messenger Groupలో బహిరంగంగా చర్చిస్తున్న సంస్థ మనది.  ఇంతటి Open సంస్థ మన సమకాలీన సమాజంలో మరొకటి లేదు.  

విమర్శ వచ్చిన  వేదిక మీదనే సమాధానం చెప్పడం సబబు. బహిరంగంగా చేసే విమర్శలకు బహిరంగంగానే సమాధానం ఇవ్వాలి. అయినా మనం ఖాజావలిని భరించాం. గట్టి సమాధానం ఇవ్వలేదు. వారు ఒంగోలు వచ్చి తన ఉపన్యాసాన్ని MTFను   చిన్నబుచ్చడానికి వాడుకున్నారు. అప్పుడూ భరించాం. మనం చేసింది తక్కువ చెయ్యాల్సింది చాలా ఎక్కువ అనే వినయం విధేయత  వున్నవాళ్లం కనుక వాళ్ళ అసంతృప్తిని పాజిటివ్ గా తీసుకున్నాం.  కలిసి పనిచేద్దామనే అనుకున్నాం. అక్కడికీ కొందరు సభ్యులు MHPS  కు నేను అవసరానికి మించిన ప్రాధాన్యతను ఇస్తున్నానని అన్నారు. 

TDP  ధర్మ పోరాట దీక్ష సభల్లో  ముఖ్యమంత్రి చంద్రబాబును MHPS ప్రధాన కార్యదర్శి ఫారూఖ్ షుబ్లి ఆకాశానికి ఎత్తి పొగిడేశారని నాకు చాలా అలస్యంగా తెలిసింది  చంద్రబాబు ముస్లింల పక్షపాతి గాబట్టే వారి మీద ప్రధాని నరేంద్ర మోదీ కక్షగట్టి వేధిస్తున్నారనీ, ఏపీ ముస్లింలు అందరూ చంద్రబాబు వెంటే వున్నారంటూ వారు ఆ సభలో మన సమాజాన్ని TDP కి రాసి ఇచ్చేశారు. ఇంత పెద్ద చారిత్రక తప్పిదాన్ని నెత్తి మీద పెట్టుకుని ఖాజావలి ఒంగోలులో MTF  ను విమర్శించే సాహసం ఎలా చేశారో ఇప్పటికీ తెలియడం లేదు.  ఒకే ఆశయాలున్న ప్రజాసంఘంతో మని చేయాలనే  MTF ఉద్దేశ్యం అలా బెడిసి కొట్టింది.

ఇక రాజకీయ పార్టీల వ్యవహారం చుద్దాము.

వచ్చే ఎన్నికల్లో ఏపి, తెలంగాణ ముస్లింలు నమ్మదగ్గ– అనగా  మన మౌలిక ఎజెండాకు  మద్దతు పలికే - రాజకీయ పార్టి ఏదో ఇంత వరకు తేలలేదు. తేలే సూచనలు కూడా కనిపించడంలేదు. అది తేలే వరకు, లేదా మనం తేల్చే వరకు రాజకీయాల్లో  మన options అన్నీ open  గానే వుంటాయి.

మనలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభిమానులు, క్రియాశీల కార్యకర్తలు కూడా వున్నారు. వాళ్ళు నిశ్ఛింతంగా  తమ తమ పార్టీల్లో పనిచేసుకోవచ్చు. పార్టీ టోపీలు పెట్టుకోవచ్చు, వొక్కాలు తొడుక్కోవచ్చు, ఖండువాలు వేసుకోవచ్చు.  అలా చేయడానికి  MTF కు ఎలాంటి అభ్యంతరం లేదు. MTF  డిమాండ్లను వాళ్ళు తమ పార్టిల వేదికల మీద ప్రవేశపెట్టి వాటి మీద ఆయా పార్టీల నాయకులు సానుకూల వైఖరిని తీసుకునేలా కృషిచేయాలి. అంతేకానీ, తమ పార్టీల అభిప్రాయాలను  తీసుకుని వచ్చి MTF  మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయకూడదు. పార్టి టోపీలు, చొక్కాలు, ఖండువాలతో MTF  సభలకు రాకూడదు. MTF  పార్టీరహిత సంస్థ అని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి.

MTF  కో-కన్వీనర్లు /  కార్యవర్గం సభ్యుల బాధ్యత భిన్నమైనది.  వాళ్ళు MTF ప్రతినిథులుగా ఏ వేదిక మీద అయినా సరే పాల్గొన వచ్చు. ప్రతి వేదిక మీద  మన సంస్థ అభిప్రాయాలను ప్రచారం చేయాలి. మన విధానాలను స్పష్టంగా చెప్పాలి.  మన కోర్కెల జాబితాను ఏ పార్టి అధినేతలకు అయినా  ఇచ్చి సానుకూలంగా స్పందించమని అడగాలి. వీలయితే ఒక ప్రషర్ గ్రూపుగా వ్యవహరించాలి. అలా స్వేఛ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వని వేదికల్లో పాల్గొనవద్దు. 

అలాగే MTF కో-కన్వీనర్లు, కార్యవర్గ సభ్యులు  ర్ గా వున్నప్పుడు నేరుగా పార్టీల టోపీలు, చొక్కాలు, ఖండువాలు వేసుకోవద్దు. అలా ఏదైనా పార్టిలో చేరి  ఖండువా కప్పుకో దలిస్తే ముందుగా MTF కో-కన్వీనర్ , కార్యవర్గ బాధ్యతల నుండి తప్పుకుని సాధారణ సభ్యులుగా కొనసాగాలి.  

ఇప్పటికి వివిధ పార్టీల మీద MTF  కు వున్న అభిప్రాయం ఇది.

1.      తెలుగుదేశం పార్టి
చంద్రబాబు ప్రస్తుతం మోదీతో విబేధిస్తున్నారు. అదొక్కటే ఆయనలో సానుకూల అంశం. అంత మాత్రాన ఆయన ఏ విధంగానూ ముస్లిం అనుకూలురు కాదు. నాలుగున్నర ఏళ్ల పాలనలో ముస్లీంలను దారుణంగా నిర్లక్ష్యం చేశారు. గెలవడానికి ఓట్లు తగ్గుతున్నాయి కనుక ఆ లోటును ఇప్పుడు ముస్లింలతో భర్తీ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ మేరకు ముస్లింలకు ఘనమైన రాయితీలను ప్రటించిందీలేదు. మన మౌలిక డిమాండ్ల మీద మాట దాటవేస్తున్నారు. వారి వ్యతిరేకత మోదీ మీదనేగానీ RSS-BJP  విధానాల మీద కాదు. గతంలో బిజెపితో రెండుసార్లు జతకట్టి రెండుసార్లు బయటికి వచ్చిన నేపథ్యం ఆయనది. మూడోసారి కలవరని చెప్పలేం.

2.      YSRCP
తాము  రెడ్డి క్రైస్తవులు కనుక ముస్లిం ఓట్లు ఎలాగూ తనవనే ధీమాలో జగన్ వున్నారు. ఇప్పుడు వారు హిందూ ఓట్లను ఆక్ర్షించే ఉద్దేశ్యంతో ముస్లింల వ్యహారంపై కనీసంగానూ  శ్రధ్ధ వహించడం లేదు. మౌజన్, ఇమామ్ లకు భృతి, దుల్హన్ పథకాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. విద్యా, ఉపాధి,  బడ్జెట్ నిధులు, రాజకీయ రంగాల్లో 8 శాతం రిజర్వేషన్ గురించి ఉఛ్ఛరించడానికి కూడా భయపడుతున్నారు.  వైయస్ రాజశేఖర రెడ్డి విధానాలకూ జగన్ విధానాలకు పోలికే లేదు. బిజెపి వ్యతిరేక విధానాలతో వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవహరిస్తే.  మోదీతో గట్టి ఘర్షణకు జగన్ సిధ్ధంగా లేరు. జారశేఖరరెడ్డివి సోనియాగాంధీ విధానాలు జగన్ వి సోనియా గాంధీ వ్యతిరేక విధానాలు. ఏ దశలో అయినా మోదీతో జగన్ జతకట్టచ్చు అనే సంకేతాలు వస్తున్నాయి.

3.      జనసేన పార్టి
పవన్ కళ్యాణ్ కులమతాల గురించి మాట్లాడడంలేదు. మాట్లాడడం తప్పు అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. పులులు జింకల్ని వేటాడుతున్నప్పుడు తాము ఏ పక్షమూ కాదు అంటే పులుల్ని సమర్ధించడమే అవుతుంది.   ఇలాంటి ‘పరిశుధ్ధ’ రాజకీయాలవల్ల ముస్లింలకు ఒనగూడే ప్రయోజనం ఏమీలేదు. పైగా BJP- మోదీ అమిత్ షాల వ్యవహారంలో మెతగ్గా వుంటున్నారు.  వాళ్లతో  కలవవచ్చు అనే సంకేతాలు కూడా వున్నాయి.  గతంలో మోదీకి ప్రచారం చేసిన చరిత్ర వారికుంది.

4.      వామపక్షాలు
వామపక్షాలు సిధ్ధాంత పరంగా ముస్లింలకు నమ్మదగిన మిత్రులు. కొన్ని రాష్ట్రాల్లో దళిత లెప్ట్ ఫ్రంట్ ను కూడా నడుపుతున్నారు.  వచ్చేఎన్నికల్ళో CPI, CPM  ఒకే కూటమిలో వుంటారన్న సంకేతాలు కూడా లేవు. ఎపీలో  ఇప్పుడు వాళ్ళు తమనే నమ్మడం లేదు. వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్ముకుని బతుకుతున్నారు.  ఇక  వాళ్లను మనం ఎలా నమ్మగలం?

5.      కాంగ్రెస్
జాతీయ రాజకీయాల్లో ముస్లింలకు కొంచెం అనుకూలమైన పార్టి ఇది. ముస్లింలకు  గట్టి మేలు చేసే విధానాలు కుడా దానికి లేవు. ఏ దశలోనూ బిజెపితో పొత్తు కుర్చుకోదు. అంత వరకే దానిలోని సానుకూలత. అయితే ఆ పార్టి దేశంలో బిజెపి వ్యతిరేకులు ఆశిస్తున్నంత స్థాయిలో బలంగా లేదు. నిజానికి కాంగ్రెస్ కు  అసలు ఫుల్ టైమ్ అధ్యక్షుడు లేడు. ఇంత కీలక సమయంలో రాహుల్ గాంధీ పది రోజులు కైలాష్ మానససరోవరం యాత్ర చేసి వచ్చారు. బహుశ ఆయన హిందూ ఓట్లను ఆకర్షించే పనిలో వున్నట్టున్నారు. ముస్లింలు తనకు మద్దతు ఇవ్వక తప్పదు అనే ధోరణి కాంగ్రెస్ లో కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికలలోనూ రాహుల్ గాంధీ ముస్లింలకు కొత్త వాగ్దానం ఒక్కటి కూడా చేయలేదు.

6.      TRS
KCR కొంతకాలం ముస్లిం సానుకూలంగా కన్పించారు. క్రమంగా వారు హిందూత్వ ఎజెండాను బయటికి తీస్తున్నారు. BJP తో సంభంధాలను బలపరచుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ విడిగా వున్నా లోక్ సభ ఎన్నికల నాటికి BJPతొ నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి.

7.      MIM
దీనికి ముస్లింల పార్టి అనిపేరుందిగానీ, ఇది ప్రాధమికంగా కుటుంబ పార్టి. అధికారంలో వున్న పార్టీతో కలిసి వుండాలనుకుంటుంది. జంట నగరాల్లో పటిష్టంగా వున్నప్పటికీ మౌలిక డిమాండ్ల మీద ప్రజర్ గ్రూపుగా పనిచేయడానికి కూడా సిధ్ధపడదు.

8.      BJP
గోగ్రవాదం, మూకోన్మాదాలను సృష్టించిన పార్టి. ముస్లింను ఎంత ఎక్కువగా  వేధిస్తే హిందూ ఓట్లు అంత ఎక్కువగా పడుతాయనే  వ్యూహంతో ఎన్నికలకు సిధ్ధం అవుతోంది. “We Will Win  Despite  Dadri Mob Killing, Award Wapsi" అని బిజేపి అధ్యక్షుడు అంటున్న మాటలకు అర్ధాలు వేరు. “We Will Win  because of  Dadri Mob Killing, Award Wapsi" అనేది వారి విధానం.

9.      SP – BSP  
ఈ పార్టిలకు AP, Telangana  రాష్ట్రాల్లో  పెద్దగా వునికి లేదు. ఇటీవల జరిగిన ఉత్తప ప్రదేశ్ ఉప ఎన్నికల్లో BJP మీద కొన్ని ఘన విజయాలు సాధించినప్పటికీ వీళ్ళ ఐక్యత ఎంతకాలం వుంటుందో చెప్పడం కష్టం. రాజకీయ అవకాశవాదంతో అవసరం అయినపుడు BJP తో కలిసిపోయిన చరిత్ర కూడా వీటికి వుంది.

10.  RJD – TMC  ముస్లిం సమస్యల మీద చురుగ్గా స్పందిస్తున్నాయి. BJP- మోదీ ల మీద గట్టి విమర్శలు కురిపిస్తున్నాయి.  రాం మనోహర్ లోహియా వారసుల్లో BJP కి లొంగని వ్యక్తిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికీ నిలబడి వున్న్సారు. ఆయన కొడుకు తేజస్వీ యాదవ్ కు ఉత్తర భారత దేశంలో మద్దతు పెరుగుతోంది.   మమతా బెనర్జీ RSS- BJP   వ్యతిరేక ప్రచారాన్ని గట్టిగా సాగిస్తున్నారు. అయితే  AP,  Telangana  రాష్ట్రాల్లో వాటికి కనీస పునాది కూడా లేదు.

మిత్రులారా !
మన భారత ముస్లిం సమాజం ప్రాణాపాయ స్థితిలో వుంది. ముస్లిం సమాజాన్ని విద్యా, ఉపాధి, రాజకీయార్ధిక  సాంస్కృతిక రంగాల్లో అణచివేయడానికీ, ముస్లిం యువకుల్ని జైళ్ళకు పంపడానికీ, వీలయితే ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి కూడా వెనుకాడని శక్తులు ఈ రోజు దేశాన్ని పాలిస్తున్నాయి.  మరోవైపు కొన్ని పార్టీలు దర్గాలు, మసీదులకు సున్నాలు, రంగులు వేయిస్తామనీ, ఖబరస్తాన్ లకు ప్రహారీ గోడలు కట్టిస్తామని, మౌజన్లు, ఇమామ్ లను హజ్ యాత్రలకు పంపిస్తామనీ, ఉర్దూను ప్రోత్సహిస్తామనే  చిల్లర వాగ్దానాలు చేస్తున్నాయి. కీలకమైన విద్యా, ఉపాధి, రాజకీయ, బడ్జెట్ కేటాయింపులు వంటి  రంగాల్లో జనాభా దామాషా ప్రకారం (8 -12-16 శాతం)  రిజర్వేషన్లు కల్పిస్తామనే  ప్రాణప్రదమైన అంశాన్ని ఎవరూ మాట్లాడడంలేదు.  సాధారణ తల నొప్పికి ఆస్పిరిన్ మాత్రలు సరిపోతాయి. కానీ, బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనెప్పికి ప్రాణరక్షణ ఔషధాలు కావాలి. మనకిప్పుడు కావలసింది  ఆస్పిరిన్  మాత్రలు కాదు. అది గుర్తుంచుకుంటే చాలు.

MTF  విధాన నిర్ణయ కార్యవర్గం  2019 ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా సమావేశమై ఇప్పటి పరిస్థితుల్లో  ముస్లిం సమాజానికి సాపేక్షకంగా, వ్యూహాత్మకంగా అనుకూలమైన పార్టి ఏదో నిర్ధారిస్తుంది.  ఆ నిర్ణయాన్ని బాహాటంగా ప్రకటిస్తుంది. అప్పుడు మన పని విధివిధానాలను సమీక్షించి కొత్త కార్యాచరణను నిర్ణయించుకుందాము. అంతవరకు ఈ విషయాలను  విస్తారంగా, సుదీర్ఘంగా చర్చిస్తునే వుందాం.

అల్లా హాఫీజ్ 

మీ విధేయుడు

-          డానీ

Comments

Popular posts from this blog

MTF - Charter Of Demands for Elections - 2019

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Muslim programme to confront the ‘Neo Manuism’