SKY Baba interview - Srinivas Jilukara HBT

 HBT guest editor గా Srinivas Jilukara

1 April 2021

ముస్లింవాద సాహిత్యకారుడిగా, ముస్లిం సామాజిక పరిస్థితిపై స్కైబాబ ఆలోచనలను పంచుకునే ఇంటర్వ్యూ🌱

*

ముస్లిం సామాజిక ఉద్యమం చేయకపోతే ముస్లింలలో సగం చీకటిలోనే ఉండిపోతారు.

*

దునియా ప్రాధాన్యం గురించి మాట్లాడడం నేడు అత్యంత అవసరం.

*

కొన్ని జమాత్ లు ముస్లింలను సామాజికంగా నిర్వీర్యులను చేస్తున్నాయి.

*

MIM ని వెనుకేసుకు రాలేం, కానీ ఆ పార్టీ ఇప్పుడు అనేక కోణాల్ని చర్చకు పెడుతున్నది.

*

TRS కి BJP యేతర ఆల్టర్నేటివ్ ఏర్పడేలా చూడడమే అవసరం.

*

దర్గా - పీర్ల పండుగ సంస్కృతుల్ని కాపాడుకోవాలి. బహుళ సంస్కృతులే మేలు.

*

హర్యాలీ లైవ్ సిరీస్ కొత్త ఆవిష్కరణలు చేసింది.

*

బహుజన సాహిత్య కారులు కొత్త మానిఫెస్టో తో ఒక రచయితల సంఘం ఏర్పాటు చేసుకోవాలి.

*

జల్ జలా సంకలనం నుంచే ముస్లింవాదం అనే పేరు స్థిరపడింది.

*

ముస్లింవాదం దేశంలోనే ఒక విశేషం.

*

ఫ్రెండ్స్! స్పందిస్తే ముస్లిం సమాజానికి ఒకింత మేలు ☘️

Hyderabad Book Trust

teSmpMarcohsf 31fdgns atom s1r0:lrlni15o SPerScadiM  · 

Skybaaba : యూసుఫ్ బాబ షేక్ 

కవిగా రచయితగా కార్యకర్తగా పాతికేళ్లుగా స్కైబాబ తెలుగు సాహిత్యంలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. ముస్లింవాద, తెలంగాణ, బహుజన అస్తిత్వ ఉద్యమాల్లో ముఖ్య భూమిక పోషించారు.

మూడు కవితా సంపుటులు, నాలుగు కథా సంపుటులు, ఒక నవల, రెండు పెద్ద కథలు, ఒక వ్యాస సంపుటి సొంత రచనలు కాగా ఆరు ముస్లింవాద సంకలనాలకు, మూడు తెలంగాణ కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. 20 ఏళ్లుగా పాత్రికేయులుగా ఉన్నారు. నీలగిరి సాహితి, తెలంగాణ సాంస్కృతిక వేదిక, సింగిడి తెలంగాణ రచయితల సంఘం,హర్యాలీ ముస్లిం రచయితల వేదిక, బహుజన సాహిత్య కచ్చీరు లాంటి సంస్థల్లో పనిచేస్తూ వస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ ఉద్యమం చేశారు. ప్రస్తుతం ముస్లిం సామాజిక ఉద్యమం తన కర్తవ్యంగా భావిస్తున్నారు. 

హర్యాలీ పేర ముస్లింవాద సాహిత్యంపై 43 వారాలుగా facebook లైవ్ కార్యక్రమం షాజహానాతో కలిసి నిర్వహిస్తున్నారు. ముస్లిం మిత్రులతో కలిసి దునియాదారి పేర ముస్లిం సోషల్ మూవ్ మెంట్ లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరి కథలు ఇంగ్లీషులోకి తర్జుమా అయి Vegetarians Only : Stories of Telugu Muslims పేర Online లో అందుబాటులో ఉన్నాయి.

◆◆

ఇవాళ ముస్లింల స్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి. ఇంటా బయటా గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. జస్టిస్ సచార్ కమిటీ ముస్లింల వెనుకబాటు గురించి విపులంగా చెప్పి ఉన్నది. వారి పురోభివృద్ధి కోసం కృషి చేయవలసిన దేశ పాలకులు వారిని ఒంటరిని చేయడానికి అన్ని అస్త్రాలు దూస్తున్నారు. దాంతో వారు మరింతగా ముడుచుకుపోయే ఘెట్టో ల్లోకి కుదింపబడే వాతావరణం పెరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ముస్లింవాద రచయిత, కార్యకర్త స్కైబాబ ఆలోచనలు పంచుకుందాం.

స్కైబాబ తో జిలుకర శ్రీనివాస్ ముఖాముఖి :

◆కవిగా మీ ప్రయాణం వివరించండి.

*సాహిత్య వాతావరణం, పెద్దగా అక్షరాస్యులు లేని కుటుంబాల నుంచి వచ్చాను. అబ్బాజాన్ మాత్రం తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో వేల నవలలు చదివి ఉంటాడు. అమ్మ కూడా కథలంటే ఇష్టపడేది. నేను వినేది. ఆశ్చర్యమేమంటే చిన్నప్పటి నుంచే నాలో కథలు నవలలుగా నడిచేవి. సమయం దొరికినప్పుడల్లా మనసులో ఒక నవల నాకు నేను చెప్పుకునేవాడిని. ఇంటర్ లోనే మూడు పేజీల చీకటి అనే కథ కాలేజ్ మ్యాగజైన్ లో అచ్చయ్యింది. కవిత్వమూ రాసేవాడిని. ఏదో ఒకటి ఎంచుకోవడం సరైందో కాదో తెలీదు. చెప్పేవాళ్ళు లేరు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి నల్గొండలో నీలగిరి సాహితి పెట్టినదాకా తాడు లేని బొంగరంలా తిరిగేవాడిని. రాసేవాడిని. పల్లకి లాంటి పత్రికలూ, నవలలు, డిటెక్టివ్స్ బాగా చదవేవాణ్ని. సినిమాలు చాలా చూసేవాడిని. చిత్రలేఖనం లోయర్ హయ్యర్ పాసై టీచర్ ట్రైనింగ్ చేశాను. సుంకిరెడ్డి పరిచయంతో ఆయన నాలోని కథకుడి పట్ల వివక్ష చూపి కవిని మాత్రమే ప్రోత్సహించాడు. నా కవితల్లో కథాత్మక కవితాలుండడం చూడొచ్చు. ముస్లిం సామాజిక పరిస్థితుల రీత్యా ఎప్పటికీ నిలిచే 10-15 కవితలు నా నుంచి వచ్చాయి. ఒక్కోదానిని ఐదారు నెలలు రాసిన కవితలున్నాయి. చిక్కనవుతున్నపాట లోని డప్పు కొట్టడమే న్యాయం కవిత మాత్రం ఒక్క డ్రాఫ్ట్ లోనే సుంకిరెడ్డి ఓకే చేశారు. పేదరికం, అప్పులు, దోస్తానా, ప్రేమ నన్ను అతలాకుతలం చేశాయి. సుంకిరెడ్డి సార్ ని చాలా విసిగించాను. అయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇవాళ ఆయన నాలోనూ తనను చూసుకుంటుండొచ్చు! సుంకిరెడ్డితో పాటు పగడాల నాగేందర్, వేముల ఎల్లయ్య, అవధానం దుర్గాప్రసాద్, మునాసు వెంకట్ తదితర నీలగిరి సాహితి మిత్రుల సాంగత్యం నుంచి ఎంతో నేర్చుకున్నాను. షాజహానా పరిచయం, ప్రేమ, సహజీవనంతో సాహిత్యమే నా జీవితమయ్యింది.

ప్రస్తుతం కవిత్వం కన్నా కథ మీదనే మనసు పడుతున్నాను. కవితలు అడపాదడపా మాత్రమే రాస్తున్నాను.

◆జల్ జలా నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు తేడా ఏమిటి? జల్ జలా లాంటి సంకలనం వొకటి మళ్ళీ రాకపోవడానికి కారణాలు ఏమిటి?

*జల్ జలా నాటికి ముస్లింవాదం వాదంగా లేదు. బహుజనవాదంలో భాగంగా వెలువడుతోంది. ఆనాటికి నిజానికి ముస్లింలు ప్రత్యేక గొంతుతో మాట్లాడే వాతావరణం లేదు. ముస్లిం కవిత్వాన్ని సంకలనం చేయాలనే ఖాజా, ఖాదర్ మొహియుద్దీన్ ప్రయత్నం విరసం ప్రచురణ జిహాద్ గా వికటించింది. అప్పటికే ముస్లిం కవిత్వం సంకలనం చేయాలనే నా ప్రయత్నం సుంకిరెడ్డి సహకారంతో జల్ జలా గా వెలువడింది. జల్ జలా ముస్లింవాదపు అన్ని కోణాలను కవర్ చేసింది. ముస్లింవాదం అనే పేరును స్థిరపరిచింది. ఆ పేరు ఖాయం చేయడానికి నీలగిరి సాహితీ మిత్రుల చర్చలు ఉపకరించాయి. అప్పటికి ఉన్న పరిస్థితుల్లో ఆ పేరు పెట్టడానికి సాహసించామనే చెప్పాలి. జిహాద్ సంకలనంపై పత్రికల్లో జరిగిన చర్చల్లోంచి కూడా ఒకింత స్పష్టత వచ్చింది.

జల్ జలా నాటికి మేమంతా కొత్త రక్తంతో దళిత (బహుజన)వాదం ఇచ్చిన ఊపుతో ఉన్నాం. అదే శక్తితో బలమైన కవిత్వం రాశాం. భిన్న అంశాలు లేవనెత్తామ్. సబ్జెక్టు కూడా ఫ్రెష్ గా ఉండింది. మేము మరింత స్పష్టతతో రాసాం. నేడు ముస్లింల పరిస్థితి మరింత దిగజారింది. కానీ కొత్తగా రాయవలసినవాళ్లు మొఖాలు చాటేస్తున్నారు. మధ్యలో కొన్ని గ్రూపుల ప్రభావం వారిని స్పష్టంగా రాయకుండా, మాట్లాడకుండా నిరోధిస్తున్నది. సమాజంలో పెరిగిన సంక్లిష్టత, బతుకుదెరువు పోరాటం కూడా వారిని ధైర్యంగా నిలవనీయడం లేదు. దేశంలో బీజేపీ దాష్టీకంలో జరుగుతున్న పరిణామాలు మరింతగా భయపెడుతున్నాయి. అయినప్పటికీ కవులనే వారు మరింత తెగువతో నిలబడాలి. కానీ అవకాశవాదం పెరిగిపోయింది. ముస్లింల నుంచి దళితుల నుంచి తిరుగుబాటు కవిత్వం రావలసిన సందర్భం. కానీ అరెస్టులు, ఉపా బెదరగొడుతున్నాయి. 

*జల్ జలా తరువాత సంకలనాలు రాలేదు అనడం సరికాదు. అలాంటి సంకలనమే మళ్ళీ రావడం కూడా రిపిటేషన్ కదా! విభిన్నమైన సబ్జెక్టుతో వచ్చాయి. గుజరాత్ ముస్లిం జెనోసైడ్ పై అజా సంకలనం, ఇండియన్ ముస్లిం కల్చర్ పై అలావా సంకలనం చాలా బలమైన కవిత్వాన్ని ఆవిష్కరించాయి. మొన్నటి ముఖామి సంకలనంలోనూ ముస్లింల నుంచి చాలా తాజా కవిత్వం వెలువరించాం. కానీ తెలుగు విమర్శకులకు వీటిని పట్టించుకునేంత సమయమూ, ఆసక్తీ లేవు. అసలు తెలుగులో ఉన్న కాసింత మంది విమర్శకులు వేటి మీద దృష్టి పెట్టడం లేదు. వారేమై పోయారో వారే తరచి చూసుకోవాలి. ఇక కొత్త విమర్శకులకు ఇలాంటి వాటిపట్ల ఆసక్తి లేదు. పై మూడు సంకలనాలు తెలుగు సాహిత్యంలో విశిష్టమైనవి. వాటిపై సరైన విమర్శ, చర్చ జరగలేదు. ప్రపంచంలోనే జాతి హత్యాకాండను ప్రశ్నించిన తొలి కవితా సంకలనం అంటూ ఒక్క సుంకిరెడ్డి మాత్రం 'అజా'పై సమీక్ష రాశారు. 

ముస్లింవాదం కథలోకి విస్తృతమయ్యింది. వతన్ తరువాత కథా మినార్, చోంగా రోటీ, మొహర్ అందుకు నిదర్శనం. అలాగే ప్రస్తుతం ముస్లింవాద ప్రతినిధులుగా ఉన్న రచయితల నుంచి నవలల కోసం తెలుగు సాహిత్యం ఎదురుచూస్తున్నది. 

◆ముస్లింవాదం సాధించిందేమిటి? 

*దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక వాదంగా ముస్లిం సాహిత్యం రావడమే పెద్ద విశేషం. ఈ విషయం విని ఇతర రాష్ట్రాల సాహిత్యకారులే ఆశ్చర్యపోతున్నారు. 

ముస్లింవాదం తెలుగు సాహిత్యానికి కొత్త చూపునిచ్చింది. అందరిలోనూ, ప్రగతిశీలురైన వారిలోనూ హిందూత్వ అంశ పర్సెంటేజీల తేడాతో దాగి ఉంటుందని అంశాన్ని చర్చకు పెట్టింది. ఒక మత సమూహం నుంచి ఒక వాదంగా సాహిత్యం ఏమిటి అనే ప్రశ్నను తుత్తునియలు చేస్తూ బాధిత సమూహమైన ముస్లింల నుంచి భిన్న కోణాల సాహిత్యం ముస్లింవాదం అందించింది. కొన్ని అస్తిత్వ వాదాల్లో కొరవడిన విభిన్నత, అనేక కోణాలు, అస్సెర్షన్, ధీరత్వం ముస్లింవాదంలో చూడొచ్చు. మాట్లాడకూడదని మూసి పెట్టిన ఎన్నో విషయాలను ముస్లింవాదం విప్పి చెప్పింది. చీకట్లో మిణుకు మిణుకు మంటున్న మిణుగురులను వెలుగు పక్షులుగా ఎగరేసింది. మాట్లాడలేకున్న ఎందరికో ఊరట నిచ్చింది. ధైర్యాన్నిచ్చింది. ఇవాళ పురుష రచయితలను దాటి స్త్రీలు తమ కలాల మొహర్ వేసేదాకా ప్రయాణం కొనసాగింది. 

ముస్లింవాద అంతర్ బాహిర్ పోరాట సాహిత్యం మొత్తంగా ప్రపంచ ముస్లింలు కూడా చింత చేయదగిన ప్రాముఖ్యత కలిగి ఉన్నది. 

◆హర్యాలీ facebook లైవ్ లు 40 వారాలకు పైగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ లైవ్ ప్రయోజనకరంగా ఉందా ? దీని అనుభవాలేమిటి?

*హర్యాలీ లైవ్ సిరీస్ నడుపుతుండడం గొప్ప అనుభవం. అస్తిత్వ ఉద్యమాల పట్ల సానుకూల దృక్పథమున్న తెలుగు రాష్ట్రాల్లోని విమర్శకులంతా దాదాపు ఈ సిరీస్ లో మాట్లాడడం, ఇంకా మాట్లాడనుండడం విశేషం. మాట్లాడిన ప్రతివారు ముస్లింల పట్ల, ముస్లిం సాహిత్యంపట్ల ఎంతో ప్రేమతో, ముస్లిం సాహిత్యం ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ముస్లింలు ప్రస్తుతమున్న పరిస్థితికి ఆందోళన పడుతూ మాట్లాడడం ఎంతో తృప్తి నిస్తున్నది. ఎందరో ఎన్నో అబ్జర్వేషన్ లను పంచుకుంటున్నారు.  కొత్త ఆవిష్కరణ లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఉపన్యాసం వారి ఫ్రెండ్ సర్కిల్ వినడం వల్ల కొత్తవారికి ముస్లింవాద సాహిత్యం పరిచయమవుతోంది. అలాగే కొత్తవారికి ముస్లింవాద చరిత్ర, ఆ పుస్తకాలూ, ముస్లిం సాహిత్యకారులూ, వారి కవిత్వం, కథలు పరిచయంలోకి వస్తున్నాయి. దీనిని కూడా మేము ముస్లింవాద సాహిత్యోద్యమంలో భాగంగానే చూస్తున్నాం. ఈ సిరీస్ మొత్తాన్ని పుస్తకంగా వెలువరించనున్నాం.

◆బహుజన ఉద్యమ కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నారు కదా.. బహుజన సాహిత్యకారులు ఎలాంటి కార్యాచరణ తీసుకుంటే మేలంటారు?

*బహుజన కథా ఊట పేర లక్ష్మీ నరసయ్య నాయకత్వంలో కొందరం 40 వారాలుగా facebook లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంతకుముందు బహుజన సాహిత్య కచ్చీరు పేర విలువైన కొన్ని కార్యక్రమాలు నిర్వచించాం. భవిష్యత్తులో బహుజన సాహిత్యకారులందరూ కలిసి మేనిఫెస్టో ఏర్పరుచుకొని ఒక రచయితల సంఘం ఏర్పాటు చేసి నడపవలసిన చారిత్రక సందర్భంలో ఉన్నాం. ఆ పనికి ఎవరు ఎప్పుడు పూనుకుంటారో చూడాలి. 

◆దీన్ కే సాత్ దునియాకొ లేకే చలో అనే నినాదం ఎందుకు తీసుకున్నారు? దీన్ (మతం) ప్రధాన సమస్యనా లేదా దునియా ప్రధాన సమస్యనా?

*రెండూ సమస్యనే! దీన్ కి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ దునియా ని సెకండరీ చేయడంలోనే ముస్లింల వెనుకబాటుతనం పెరిగిపోతూ వస్తున్నది. మతం గురించి పల్లెత్తు మాట అననీయని మహానుభావులు ముస్లింలలోనే ఎక్కువ. సాహిత్యం ప్రాధాన్యం వారికి తెలీదు. ఇలాంటివారి వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టం మరింత ఎక్కువ. దీనికి వత్తాసుగా ముస్లింలలో అంతర్గత సంస్కరణల గురించి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మాట్లాడడం సరికాదనే ముస్లిమేతర మేధావులూ ఉన్నారు. సైమల్టేనియస్ గా రెండు పోరాటాలూ జరగాలని మేమంటున్నాం. లేదంటే ముస్లింలలో సగం చీకట్లోనే ఉండిపోతారు.

దునియా ప్రాధాన్యం గురించి మాట్లాడగలిగేవాళ్ళం ఆ విషయాలను మాట్లాడడమే ముస్లిం సమాజానికి చేయగలిగిన మేలు అని భావించి దీన్ కే సాత్ దునియాకొ లేకే చలో నినాదం తీసుకొని ముస్లిం సోషల్ మూవ్మెంట్ చేస్తున్నాం. మతానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చే ఏ సమూహమైనా నేడు పురోగమించడం అసాధ్యం. పైగా ముస్లింలలో మతం మీద ఆధారపడే వారి సంఖ్య పెరుగుతోంది. అది కూడా నష్టమే. మా సోషల్ మూవ్మెంట్ వల్ల ముస్లింలను ఏమాత్రం ఫ్లెక్సిబుల్ గా ఆలోచించేలా చేసినా మేము సక్సెస్ అయినట్లే లెక్క!

సామాజికంగా కూడా ఉద్యమించవలసిన అవసరం ముస్లిం సాహిత్యకారులపై ఉందని బాలగోపాల్, అంబటి సురేంద్రరాజు, సుంకిరెడ్డి చెప్పి ఉన్నారు. దాంతో ఒక మెట్టు దిగి మేము దీన్ కే సాత్ దునియాకొ లేకే చలో అనే నినాదం ఎత్తుకొని ముస్లిం సోషల్ మూవ్ మెంట్ చేస్తున్నాం. అన్ని సమూహాలకు ప్రాపంచిక విషయాలపై సూటిగా ఉద్యమించే  ఒక వెసులుబాటు ఉంది.. అది ముస్లిం సమూహానికి లేకపోవడం ఒక లోపం. అది ఇప్పట్లో సరిదిద్దే అవకాశం లేదు. అందుకే కొంత రాజీ పడి ఈ నినాదం తీసుకున్నాం. ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. ప్రస్తుతం దునియాదారి అనే facebook లైవ్ సిరీస్ నిర్వహిస్తున్నాం. ఈ ఉద్యమం పేర వెలువరించిన కరపత్రం విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళింది.

◆ముస్లిం సమాజంలో బహుళ దృక్పథాలున్నాయి. ఖురాన్ ను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో ముస్లిం పండితుల మధ్య వచ్చే వ్యాఖ్యాన విభిన్నతలే అనేక జమాతుల ఆవిర్భావానికి కారణమయ్యిందనే విమర్శలు వున్నాయి. అనేక జమాతులు వొక ధార్మిక సంస్థగా, వొక రాజకీయ పార్టీగా ఎందుకు మారటం లేదు? 

*నిజమే.. జమాతులు అనేక వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. ఎవరికి అర్ధమైనంతవరకు వారు ఇదే ఇస్లాం అని బోధిస్తున్నారు. కొన్ని మూడాఛారాల విషయంలో మార్పులు చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. గత ఏడాది తబ్లీక్ జమాత్ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరించిందో చూశాం. (ఈ జమాత్ లోని కొందరు టీవీ చూడకూడదని కూడా బోధిస్తుండడం విచారకరం.) ఈ సందర్భంలో, ఎన్నార్సీ ఉద్యమ సమయంలో అన్ని జమాతులు కలిసి కార్యాచరణకు దిగడం ఒకింత ఆశ. ఈ జమాతులన్నీ కలిసి ఒక ధార్మిక సంస్థగా మారే అవకాశం లేదు. ఆ ప్రయత్నం చేయడానికి ఎవరికీ ఆసక్తి లేదు. అలా ఏక సంస్థగా ఏర్పడితే చాలామంది జీవనోపాధి కోల్పోతామనే భయమూ ఉండొచ్చు. అలాగే జమాతులన్నీ కలిసి రాజకీయ పార్టీగా మారే అవకాశం కూడా లేనట్లే. ఈ జమాతుల్లోని ముఖ్యులకు రాజకీయ ఆసక్తి దాదాపు ఉండదు. వీరే ముస్లింలను మరింత నిర్వీర్యులను చేస్తున్నారు. 

◆ఎంఐఎం వొక జాతీయ పార్టీగా ఏర్పడటానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ అది బిజెపి ప్రాయోజిత కార్యక్రమం అనే విమర్శలు వున్నాయి. ఎంఐఎం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా?

*ఎంఐఎం పై విమర్శల్లో క్లారిటీ లేదు. బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పెట్టకపోవడమే కాకుండా ముస్లింల ఓట్లే తమకు వద్దని చెప్పడం చూశాం. మొన్న బీహార్ లో ప్రతిపక్షాల కూటమి ఎంఐఎం ని కలుపుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో ఎంఐఎం ఒంటరిగా పోటీ చేసింది. అది ప్రతిపక్షాల కూటమి ఓటమికి కారణమైంది. మరి ముస్లింల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పార్టీని తమ జట్టులో కలుపుకోవడానికి ప్రతిపక్ష కూటమికి వచ్చిన నష్టమేమిటి? హిందువుల పార్టీగా బాహాటంగా చెప్పుకుంటూ బీజేపీ మాత్రం పోటీ చేయొచ్చు, ఎంఐఎం ని మాత్రం ఒంటరిని చేయడం చూశాం. అట్లా అని  ఎంఐఎంని వెనకేసుకు రావలసిన అవసరం లేదు. అది పోటీ చేసే చోట లౌకిక పార్టీలతో పొత్తుకు ప్రయత్నించాలి. లేదంటే ఆ పార్టీలకు నష్టం కలిగే అవకాశమున్న చోట పోటీ గురించి పునరాలోచించుకోవాలి.

*మతం ఆధారంగా ఓట్లు అడిగే ఏ పార్టీ వల్ల నైనా ఆ మత సమూహానికి నష్టమే. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధికి ఎంఐఎం చేసింది ఏమీలేదు. అలాగే  ఎంఐఎం మాత్రమే ముస్లింలకు ప్రతినిధి అని అనుకోడానికి లేదు. కేవలం టోపీవాలా లను, దాడీవాలా లనే ముస్లింల ప్రతినిధులుగా గుర్తించే వాతావరణమే ముస్లింలకు నష్టం చేస్తున్నది. 

◆తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముస్లిం రాజకీయాలు, బహుజన రాజకీయాలు బాగా బలహీనంగా మారాయి. బిజెపి, టిఆర్ఎస్ మధ్య రాజకీయ తేడాలు మాత్రమే వున్నాయి. కానీ మతపరమైన అవగాహనలో తేడాలు లేవు. మనువాద ఎజెండాను రెండు చక్కగా అమలు చేస్తున్నాయి. టిఆర్ఎస్ ను ముస్లింలు ఎందుకు వోన్ చేసుకుంటున్నారు?

*తెలంగాణ ఉద్యమ కాలం నాటికి బహుజన ఉద్యమాలు ఊపులో ఉన్నాయి. చతికిలబడ్డ అగ్రవర్ణాలు తెలంగాణ ఉద్యమం పేర మళ్ళీ పీఠాలెక్కారు. పట్టణాలకు పారిపోయిన దొరలు తిరిగి గ్రామాలకు చేరిన చందమే ఇది. ఆంధ్రా అగ్రకుల పెత్తందారీ తనాన్ని పారదోలడం అవసరం అనుకున్నాం. కానీ ఆ ఉద్యమ వేడిలో బహుజన ఉద్యమాలు చల్లారిపోవడం విచారకరం. తిరిగి వాటిని నిర్మించుకోవాల్సిందే. ఇప్పుడు ముంచుకొస్తున్న మనువాద ముప్పు గురించి స్పష్టంగా గట్టిగా మాట్లాడవలసిందే. కాకపొతే బహుజనవాదుల్లో ముఖ్యంగా దళితుల్లోని చైతన్యవంతులు చీలికలు పేలికలుగా ఉద్యమిస్తుండడమే నిరాశాజనకంగా ఉంది.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ముస్లింవాద, దళిత సాహిత్యకారులు కొందరు తమ పని తాము చేస్తూనే తెలంగాణ కోసం ఉద్యమించడం చూశాం.   

*గుడ్డి కన్నా మెల్ల మేలు అనే చందంగా ముస్లింలు టీఆరెఎస్ వైపు మొగ్గుతున్నారు. కాంగ్రెస్ బలంగా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. 12 శాతం రిజర్వేషన్ కల్పించడంలో ఫెయిలయి కనీసం ఆమాత్రం ప్రాతినిధ్యాన్నైనా అన్ని రంగాల్లో కల్పించని టిఆర్ఎస్ కి బుద్ధి చెప్పేవారు. ఆల్టర్నేటివ్ స్థానంలో బీజేపీ వస్తుండడం ముస్లింలను బెదరగొడుతోంది. తెలంగాణ ఉద్యమకారులు, విప్లవవాదులు సైతం కేసీఆర్ మీది కోపంతో టిఆర్ ఎస్ ను ఓడించమని పిలుపునిస్తూ బీజేపీ గెలవడాన్ని చూడనట్లు నటిస్తున్నారు. ఆ రకంగా పాదుకుపోయే బీజేపీ తెలంగాణను మరో ఉత్తరప్రదేశ్ చేసే ప్రమాదాన్ని పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యం. ''ఈనగాచిన పంట నక్కల పాలు చేయడమే!'' ఈ విషయంలో వీరిలోని హిందుత్వ అంశ బయటేసుకుంటున్నారు. టిఆర్ఎస్ కి బీజేపీ యేతర ఆల్ట్రనేటివ్ ఏర్పడేలా చూడడమే అందరి తక్షణ కర్తవ్యం! 

◆సౌదీ అరేబియా లో ఆచరించే ఇస్లాం ఆచారాలు, సంప్రదాయాలను ఇక్కడ కూడా పాటించాలని కొన్ని జమాతులు ప్రచారం చేస్తున్నాయి. అది ఫండమెంటలిజానికి దారి తీస్తుంది. ముస్లిం సమాజంలోని బహుళ సంస్కృతిని కాపాడుకోవడానికి ఏం చేయాలి?

*ఇండియన్ కల్చర్ లోంచి ముస్లింలు ఆచరిస్తున్న కొన్ని భిన్న సంస్కృతులను కొనసాగించాల్సిందే. దర్గా సంస్కృతి, పీర్ల పండుగ సంస్కృతి ముస్లింలు, మిగతా బహుజనుల మధ్య అలాయిబలాయి సంస్కృతిని కొనసాగిస్తున్నాయి. వాటిని కాపాడుకోవాలని 'అలావా' ముస్లిం సంస్కృతి కవితా సంకలనంలో ప్రతిపాదించాం. 

ఏకశిలా సదృశ్యమైన దేదైనా ప్రమాదమే! బహుళ సంస్కృతులే మేలు! 

ఈ విషయాలు మాట్లాడ్డానికి ముస్లిం ఇంటెలెక్చువల్స్ సిద్ధంగా లేరు. వీరితో పాటు, ముస్లిం రాజకీయ నాయకుల బాధ్యతా రాహిత్యం ముస్లింలను మరింత ఫండమెంటలిస్టులుగా మారడానికి అవకాశం కల్పిస్తున్నది. కనీసం ఈ విషయాలు మాట్లాడే సాహసం చేస్తున్న మాలాంటివారికి కూడా అడ్డుపడుతూ మరింత గందరగోళం సృష్టిస్తున్నారు ముస్లిం మేధావుల మనుకుంటున్న కొందరు.



Danny Comment :

మత భావన అలౌకికం, మతవాదం లౌకికం అనే అవగాహన ఈ ఇంటర్ వ్యూలో లోపించింది.

 

భారత ముస్లింల వెనుకబాటుతనానికి ముస్లింలే కారకులనే ఒక ప్రమాదకర ఆరోపణను నిరూపించడానికి  ఈ ఇంటర్ వ్యూ  ప్రత్నించింది. దేశంలో రాజ్యమేలుతున్న మనువాద ఫాసిజం సమస్త రంగాలలో ముస్లీం సమూహాలను అణిచివేస్తున్నదన్న వాస్తవాన్నీ ఈ ఇంటర్ వ్యూ మరుగుపరిచింది. గతంలో చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెపుతున్నాను. స్కైబాకు ‘ముస్లిం’, ‘వాదం’ అనే రెండు పదాలకు నిర్వచనం తెలీదు. ‘ముస్లింవాదం’ మీద ఇంటర్ వ్యూ చేసిన జిలుకర శ్రీనివాస్ ప్రాణప్రదమైన ఈ అంశాన్ని కన్వీనియంట్ గా తప్పించడం మేధోసాంప్రదాయానికి అనువుగా లేదు.


Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution