MTF Manifesto day Message - 4th July 2018
MTF Manifesto day Message - 4th
July 2018 
మెగా
కార్పొరేట్ల ఆర్ధిక ప్రయోజనాలకు మతం ముసుగు కప్పుతున్న 
ఆరెస్సెస్ - బీజేపి శక్తులే మన ప్రత్యర్ధులు  
సభ్యులు, అభిమానులు,
మద్దతుదారులు, సంఘీభావులు అందరికీ  ముస్లిం ఆలోచనాపరుల వేదిక / Muslim Thinkers Forum (MTF)  ప్రణాళిక దినోత్సవ శుభాకాంక్షలు. 
మిత్రులారా!
 జులై 4 మన ప్రణాళిక దినం. మనం MTF ప్రణాళికను రూపొందించుకుని
సరిగ్గా ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో మన సంస్థ ఆనాడు మనం ఊహించిన దానికన్నా తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేగంగా విస్తరించింది. ప్రాంతాలు,  సమూహాలు, సంస్థలు, ప్రభావశీలురు పరంగానేగాక ఆలోచనల
స్థాయి పరంగానూ ఈ విస్తరణ గొప్పగా సాగింది. 
మనం కేవలం
ఆలోచనాపరులుగా మాత్రమే వుండిపోవడం ఎక్కువ కాలం 
కుదరదనీ, MTF  ను క్రమంగా నేల మీదికి
దించి ఒక ఉద్యమ సంస్థగా మార్చాల్సి వుంటుందని మనం ప్రణాళికను రూపొందించుకుంటున్నపుడే
స్థూలంగా అనుకున్నాము.  ఆ అవగాహనతోనే మనం తెలంగాణలో  రోహింగ్యాలు, మల్లాపూర్ (జగిత్యాల) లలో ముస్లిం
సమస్యల్నేగాక నేరెళ్ళ, అభంగపట్నం, ఉస్మానియా విశ్వవిద్యాలయం తదితర చోట్ల దళితుల సమస్యల్ని
కూడా పట్టించుకున్నాము. బహుజన ప్రతిఘటన వేదిక, టీ-మాస్, దళిత-లెప్ట్ తదితర సమాఖ్యల్లో  క్రియాశీల బాధ్యతలు నిర్వహిస్తున్నాం. 
అలాగే, ఆంధ్రప్రదేశ్
లో దివాన్ చెరువు (రాజమండ్రి),  వినుకొండ, పిడుగురాళ్ళ
దాడుల్ని పట్టించుకున్నాము. సాటి అణగారినవర్గాలయిన ఆదివాసులు, దళితులు, మైనార్టీలు,
బహుజన  సమూహాల ఆత్మరక్షణకోసం, ఆత్మగౌరవం కోసం  మన వంతు సంఘీభావాన్ని వ్యక్తం చేశాం. గరగపర్రు,
పిఠాపురం, అమలాపురం బాధితుల్ని బాధ్యతగా వెళ్ళి పలకరించాము.  దళిత్ – ముస్లిం ఇఫ్తార్ ఆలోచనని ముందుకు తెచ్చి
ఆచరించాం.  బహుజన రచయితల వేదిక వంటి సంస్థలతో
క్రియాశీలంగా కలిసి పనిచేస్తున్నాము. అచ్చంగా ముస్లిం ప్రభావశీలురతో  రాష్ట్ర స్థాయి రాజకీయ మేధోమధన సదస్సుని నిర్వహించడం  MTF కు ఒక చారిత్రాత్మక విజయం. మన స్వీయ సమాజంతోపాటూ
మన సాటి అణగారిన సమూహాలకు సహితం ఇప్పుడు మన మీద నమ్మకం పెరిగింది. అలా మన  బాధ్యత కూడా పెరిగింది. 
సాటి అణగారిన
సమూహాలకు సంబంధించి మనకు ఒక స్పష్టమైన అవగాహన వుండాలి. మనం అణగారిన సముహాలుగా ఏకం అవుతున్నాము.
ఇతర అణగారిన సమూహాలకు సంఘీభావాన్ని తెలపడం, అణిచివేతను వ్యతిరేకించడం,  ఏ రకమైన అణిచివేతలేని సమాజాన్ని  నిర్మించడం  మనందరి  సాధారణ
అవగాహన. అయితే, విభిన్న  అణగారిన సమూహాల మధ్య
వైవిధ్యం మాత్రమేగాక వైరుధ్యాలు  కూడా వుంటాయి.  వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. 
మైనార్టీ మతసమూహంగా
మనం మెజార్టీ మతసమూహంతో మతసామరస్యాన్ని కోరుకుంటున్నాము. అదే మన కార్యక్రమం
(Programme). దళితులు, బహుజనుల కార్యక్రమం 
మతసామరస్యంకాదు; కుల నిర్మూలన. అలాగే, ఆదివాసుల కార్యక్రమం కులనిర్మూలనకాదు   మైదానప్రాంతవాసుల
దాడుల నుండి రక్షణ. అదేవిధంగా స్త్రీవాదుల  కార్యక్రమం; పితృస్వామిక వ్యవస్థ నిర్మూలన లేదా మాతృ వంశావళీ వ్యవస్థ నిర్మాణం. ఈ ఐక్యతా ఘర్షణల్ని అర్ధం చేసుకుంటూ మనం సాటి అణగారిన
సమూహాలతో  మెలగాలి. 
మనం ముస్లిములము
అంటూ ఒక అస్తిత్త్వాన్ని ప్రకటించుకున్నప్పుడు అనివార్యంగా మనం ఇస్లాం మతసమూహానికి
చెందుతాము. విభిన్న మతాల మధ్య విరుధ్ధాంశాలు 
మాత్రమేగాక అనేక సారూప్యాలు కూడా వుంటాయి. విరుధ్ధాంశాల్ని పక్కన పెట్టి భావసారూప్యం
వున్న అంశాలను అభివృధ్ధిచేయడమే మతసామరస్యం. 
మతసామరస్యానికి
ఇప్పుడు ముప్పుపొంచి వున్నది కార్పొరేట్ల రాజకీయార్ధిక ప్రయోజనాలకు మతం ముసుగు కప్పుతున్న
ఆరెస్సెస్-బీజేపి శక్తులతోనేగానీ, హిందూ దైవభక్తి గలవారితోకాదు. ఏ మతానికి చెందినవారైనా
సరే భక్తులు స్వతహాగ సున్నిత మనస్కులు, నిస్సహాయులు, మంచివారు, అమాయకులు. విభిన్నమతాలకు
చెందిన భక్తులంతా పరస్పరం సహకరించుకున్నప్పుపుడే మత సామరస్యం సాధ్యం అవుతుంది. 
మిత్రులారా
! 
ఇతర మతాల ఉగ్రవాదాలకేకాదు
ముస్లిం ఉగ్రవాదానికి సహితం మనం వ్యతిరేకులం. మెజార్టిల ఉగ్రవాదం సమాజంలో విధ్వంసాన్ని
సృష్టిస్తుంది; మైనార్టిల ఉగ్రవాదం స్వీయ సమాజపు వినాశనానికి దారితీస్తుంది.  
మన కోరికలు
ప్రజాస్వామికమైనవి. మన ఆలోచనలు ప్రజాస్వామికమైనవి. మన పని విధానాలు ప్రజాస్వామికమైనవి.
మనం మన దేశ సహజ వనరుల్లో న్యాయమైన వాటా కోరుతున్నాము. మన సమాజ సంస్థల్లో భాగం కోరుతున్నాము.
ప్రజాస్వామిక చట్ట సభల్లో ప్రాతినిధ్యం కోరుతున్నాము.
ఇప్పుడు మనం
ఒక చారిత్రక దశలోనికి ప్రవేశించాం. 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు  మనకు ఒక పెద్ద సవాలును విసిరాయి. అన్నిరంగాలలో మనల్ని
అణిచివేస్తున్న  ఆరెస్సెస్ శక్తుల్నీ సాంస్కృతిక
రంగంలోనూ, బీజేపి శక్తుల్ని రాజకీయ రంగంలోనూ ఓడించడం  ఇప్పుడు మన లక్ష్యం. దానికోసం సర్వశక్తుల్ని ఫణంగా
పెట్టి పోరాడాల్సిన  సమయం ఆసన్నమైంది.  
ఎన్నికల వ్యవహారం
చాలా పెద్ద పని. ముస్లిం ఓటర్ల నమోదు మొదలు ఎన్నికల్లో ముస్లిం అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని
నిలబెట్టే ఎత్తుగడను రూపొందించి ఆచరించి ఫలితాలను సాధించడం వరకు అదొక బృహత్ పథకం.  అసాధ్యం కాకపోయినా కష్టసాధ్యమైన ఈ పథకాన్ని పూర్తి
చేయడానికి పెద్ద ఎత్తున మానవ వనరులు, ఆర్ధిక వనరులు కావాలి.  చేసే పనిలో అంకితభావం వుంటే అవసరమైన వనరులు వాటికి
అవే సమకూరుతాయనడానికి మన గత ఏడాది అనుభవమే సాక్ష్యం. 
ఇటీవలి కాలంలో
మన సంస్థలోనికి అనేక మంది ప్రభావశీలురు  వచ్చి
చేరుతున్నాయి. కేవలం ఒంగోలు సదస్సులోనే వివిధ విభాగాలు, రంగాలకు చెందిన దాదాపు 20 మంది
కొత్తవారు చేరారు.  షేక్ కరీముల్లా షా, బీ.
ఇనాయతుల్లా,  సాబీర్ హుసేన్, ఎం. ఏ. కలామ్,  డాక్టర్ రహమాన్. ముహమ్మద్ మతీన్, షేక్ అబ్దుల్ ఖాదర్,
షఫీ అహ్మద్, హుస్సేన్ షేక్, అడ్వకేట్ జీలానీ వంటి వారికి తగిన గుర్తింపుగల బాధ్యతల్ని
ఇవ్వాల్సి వుంది. 
ఇప్పటి వరకు
మన సంస్థ నిర్మాణం కన్వీనర్ వ్యవస్థగా కొనసాగుతోంది. రాబోయే విస్తరణకు, అవసరాలకు ఈ
నిర్మాణరూపం  సరిపోదు. మనం ఇక ముందు అధ్యక్ష
లేదా కార్యదర్శి నిర్మాణ రూపాల్ని పాటించాలని నా ప్రతిపాదన. దీనిమీద సలహాలు సూచనలు
ఇవ్వండి. 
మనకన్నా ముందు
నుండి పనిచేస్తున్న సంస్థలు అనేకం MTF బయట వున్నాయనే వాస్తవాన్ని మనం సవినయంగా ఆమోదించాలి.
వాటినన్నింటినీ సగౌరవంగా MTF సమాఖ్య  గొడుకు
కిందికి తీసుకు రావడం మన కర్తవ్యం. ఎన్నికల నాటికి ముస్లిం సమాజంలో  ఏకాభిప్రాయాన్ని సాధించడం మన లక్షం.  
అయితే ముస్లిం
ప్రముఖుల్లోనూ, ముస్లిం సంస్థల్లోనూ ఆరెస్సెస్-బీజేపీలతో అంటకాగేవారూ,  వచ్చే ఎన్నికల్లో ఆ రెండు శక్తుల అధికారాన్ని నిలబెట్టడానికి
‘రా’ (Research and Analysis Wing) తో, అమిత్ షాతో  మంతనాలు చేస్తున్నవారూ ఈ రెండు రాష్ట్రాల్లోనూ వున్నారు.
అలాంటివాళ్ళను గుర్తించి ద్రోహులుగా ప్రకటించక తప్పదు. ఇంటి దొంగల మీద కనికరం చూపేవాళ్ళు
బయటి దొంగల్ని ఎప్పటికీ పట్టుకోలేరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో మొస్సద్ (Mossad)
సహితం చురుగ్గా పనిచేస్తున్నదని
ఇటీవల కొన్ని సంకేతాలు వెలువడ్డాయి. ఇదొక కొత్త ప్రమాదం. 
విస్తరణ
MTF లక్ష్యం, లక్షణం. ముస్లిం మేధోసరోవరం అంటే తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్ లో అయినా
ముస్లీం సమాజమేకాదు, ముస్లిమేతర సమాజాలు సహితం MTF  వైపు  చూడాలి,
చూపాలి. అది మన తక్షణ లక్ష్యం. దీన్ని సమీప భవిష్యత్తులో చాలా వేగంగా సాధించాలి. మన
ముందు కేవలం మూడు వందల రోజులే వున్నాయి. సమయం తక్కువగా వున్నప్పుడు లక్ష్యాలను సాధించాలంటే
పని వేగం పెంచాలి, పనిచేసేవాళ్ళ సంఖ్యను పెంచాలి. ఏదీ అసాధ్యంకాదు. భారీ లక్ష్యాలను
సాధించడానికి మూడు అంశాలు కావాలి. ‘అంకిత భావం, అంకిత భావం, అల్లా దయ’.  
కార్పొరేట్ల రాజకీయార్ధిక ప్రయోజనాలకు మతం ముసుగు కప్పుతున్న శక్తుల్ని
ఓడించడానికి నడుంబిగించండి. “యా అల్లా!” అని మొదలెట్టండి; విజయం మనదే!  
మీ
-       
డానీ
Comments
Post a Comment