Let's get an Identity for Muslim vote


ముస్లిం ఓటుకు గుర్తింపును సాధించుదాం

-       -  డానీ


సామాన్య ముస్లింల నుండి   విద్యావంతుల వరకు,  ఆదివాసీల నుండి అగ్రకులాల వరకు, ముస్లిం సంఘాల నుండి అణగారిన  సమూహాల సమాఖ్యల వరకు, మతసామరస్యవాదుల నుండి మతతత్త్వవాదుల వరకు,  నిన్నమొన్న పుట్టిన పార్టీలు మొదలు గ్రాండ్‍ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా వరకు, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నుండి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వరకు, ఇప్పుడు  ముస్లిం ఆలోచనాపరుల వేదిక  (ఎంటీఎఫ్‌) గురించి చర్చిస్తున్నాయి. తెలుగు సామాజిక రాజకీయ మేధో రంగాల్లో ఎంటిఎఫ్ ఇప్పుడు ఒక శక్తిగా మారింది. ఆంధ్రా ముస్లింలురాజకీయ దశదిశ -2019 పేరిట ఒంగోలులో ముస్లింల మేధోమధన రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన తరువాత రాజకీయరంగంలో ఒక కుదుపు వచ్చింది. ఇలాంటి సభ జరపడం ఇటీవలి కాలంలో  తొలి ప్రయత్నం.

ఇప్పుడు అన్నిచోట్లా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే ఎంటిఎఫ్ ఏం చేయబోతున్నదీ? అని.  ఈ ప్రశ్నకు మూడు అర్ధాలున్నాయి. మొదటిది; స్థూలంగా ఎంటిఎఫ్ కార్యక్రమం ఏమిటనేది?  రెండోది; ఒంగోలు సదస్సు క్యూ షీట్ (cue sheet) ఏమిటనేది. మూడోది; ఒంగోలు  ప్రకటన ఏమిటనేది. బయటవున్నవారికేకాక  ఎంటిఎఫ్ లోపలున్నవారిలోనూ కొందరిలో ఇలాంటి సందేహాలు వుండవచ్చు. అందరి కోసం ఇంకోసారి వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది.

భారత ముస్లిం సమాజపు అభ్యున్నతి కోసం మేధోరంగంలో కృషి చేయడం ఎంటిఎఫ్ నిరంతర సాధారణ కార్యక్రమం. సహజ వనరుల్లో, సమాజ వ్యవస్థల్లో ముస్లింలకు న్యాయమైన ప్రాతినిధ్యాన్ని సాధించి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే అభ్యున్నతి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంటిఎఫ్ పనిచేస్తున్నది. త్వరలో,  ఇతర రాష్ట్రాలకు విస్తరించే పనిలో వుంది. కర్ణాటకతో ఇప్పటికే సౌహార్ధ సంబంధాలను నెలకొల్పుకుంది.

ఒంగోలు మేధోమధన రాష్ట్ర సదస్సు  థీమ్ “ముస్లిం ఓటు శక్తిని చాటుదాం ! ముస్లిం ఓటుకు గుర్తింపును సాధిద్దాం!!” అనేది. రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముస్లింలు  ఏ రాజక్లీయ పార్టీకి మద్దతు పలకాలి అనేది ఒంగోలులో అసలు చర్చనీయాంశమేకాదు.  పూర్తిగా ఉనికినే కోల్పోయిన, దారుణ నిర్లక్ష్యానికి గురవుతున్న ముస్లిం ఓటుకు మరలా గుర్తింపును తీసుకురావడమే ఇప్పుడు ప్రాణప్రదమైన అంశమని ఎంటిఎఫ్ భావిస్తోంది. 

అందువల్ల, టిడిపికి మద్దతు ఇద్దాం, వైయస్సార్ సిపి మనకు మంచిది, కొత్తదైన జనసేనతో ఒక ప్రయత్నం చేద్దాం,  కాంగ్రెస్సే అన్నింటా బెటరు, కమ్యూనిస్టుల పక్షం నిలబడదాం, ఎంఐఎంను గెలిపిద్దాం? మాయావతి, ములాయంసింగ్ యాదవ్ మనోళ్ళే, అసలు ఏ వివాదంలేకుండా బీజేపీలో చేరిపోతే పోలా? తదితర కాలం చెల్లిన ఫార్మూలాలకు ఇది వేదిక కాదు. అంతకు మించి మెదళ్లకు పదును పెట్టగలిగిన వాళ్లకే ఇది వేదిక. ముస్లిం ఓటు గౌరవాన్ని పెంచే. ముస్లిం సమాజపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వినూత్న ప్రతిపాదనల్ని తీసుకురండి.  రాజకీయ విశ్లేషకులకు, ఆలోచనాపరులకు, ఇదొక సవాలు.  కొత్త ఆలోచనలకు ఒంగోలు స్వాగతం పలుకుతోంది.

ఇక క్యూ షీట్.  సదస్సురెండు రోజుల పాటు సాగుతుంది. ఇందులో ఏడు సమావేశాలు (సెషన్స్) వుంటాయి. మొదటి రోజు ఉదయం సహజంగానే ప్రారంభ సమావేశం వుంటుంది.  ఇందులో, ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహిత దేవీప్రియ ప్రధాన సందేశం ఇస్తారు. ఎంటిఎఫ్ తో భావసారూప్యంగల ముస్లిం సంస్థలు శుభాకాంక్షలు తెలుపుతాయి. ఎంటిఎఫ్ బాధ్యులు సంస్థ లక్ష్యాలనీ, సదస్సు లక్ష్యాలనీ, చర్చల విధివిధానాలనీ  వివరిస్తారు.  ఆ తరువాత రెండు రోజులపాటు  ఒక్కొక్కటి రెండు గంటలు చొప్పున మొత్తం పది గంటలు సాగే ఐదు మేధోమధన సమావేశాల్లో సదస్సు ప్రతినిధులు తమ ప్రతిపాదనల్ని ప్రవేశపెడతారు. ఆ పరితిపాదనల మీద ఎప్పటికప్పుడు చర్చలు వుంటాయి. చివరిదైన ఏడవ సమావేశంలో సదస్సులో వచ్చిన ప్రతిపాదనల్నీ, వాటికి వచ్చిన సమర్ధనల్ని, వాటిపై వచ్చిన విమర్శల్నీ, క్రోడీ కరించి సదస్సు తీర్మానాన్ని రూపొందిస్తారు.

ఇక ఒంగోలు ప్రకటన (డిక్లరేషన్). ఒంగోలు మేధోమధన సదస్సు తీర్మానాన్నే ‘ఎంటిఎఫ్ ఒంగోలు ప్రకటన’గా పరిగణిస్తారు. సదస్సు జరగక ముందే, సదస్సులో భిన్నాభిప్రాయాలు ఘర్షించి ఒక అవగాహనకు రాకముందే, ఒంగోలు ప్రకటన గురించి మాట్లాడడం ప్రజాస్వామిక విలువ కాదు. దాని కోసం అందరం జూన్ 24 రాత్రి వరకు ఆగాల్సిందే !

Contact :    Nabi Kareem Khan 96661 92292
                   Danny – 90107 57776


ముస్లింల ఆత్మగౌవాన్ని నిలబెడదాం !
ఒంగోలు మేధోమధన సదస్సుకు తరలిరండి !
వినూత్న ప్రతిపాదనల్ని ప్రవేశపెట్టండి !!

-        డానీ

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution