రోహింగ్యాలు అక్రమ వలసదారులే: రాజ్‌నాథ్‌

వారు శరణార్థులు కాదు
Sakshi | Updated: September 22, 2017 01:29 (IST)
వారు శరణార్థులు కాదు
రోహింగ్యాలు అక్రమ వలసదారులే: రాజ్‌నాథ్‌
న్యూఢిల్లీ: రోహింగ్యాలు శరణార్థులు కారని, వారు అక్రమ వలసదారులని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. రోహింగ్యాలు దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారని, వారిని తప్పనిసరిగా వెనక్కి పంపించేయాలన్నారు. గురువారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్వహించిన సదస్సులో రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. రోహింగ్యాలను తమ దేశం తీసుకెళ్లేందుకు మయన్మార్‌ సిద్ధంగా ఉందని, అయినా మనదేశం నుంచి వారిని వెనక్కి పంపించే ప్రయత్నాలను కొందరు వ్యతిరేకించడం తగదని చెప్పారు.
‘రోహింగ్యాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ తమ వైఖరిని అఫిడవిట్‌ ద్వారా సుప్రీం కోర్టుకు సమర్పించింది. వారు అక్రమ వలసదారులు. శరణార్థులు కారు. వారిని వెనక్కి పంపిస్తాం. శరణార్థి హోదా పొందా లంటే ఒక నిర్దిష్టమైన ప్రక్రియను అనుసరిం చాలి. కానీ వీరు దానిని అనుసరించలేదు’ అని చెప్పారు. రోహింగ్యాలు ఎవరికీ భారత్‌లో ఆశ్రయం కల్పించే అవకాశం లేదని, ఎందుకంటే వారు అక్రమ వలసదారులని స్పష్టం చేశారు. వీరిని వెనక్కి పంపే అంశంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడంలేదని చెప్పారు. ఇతర దేశాల్లోని ప్రజల గురించి ఆలోచించే కంటే ముందు దేశంలోని ప్రజల మానవ హక్కుల గురించి ఆలోచించడం మంచిదని హితవు పలికారు.

మానవతా దృక్పథంతోనే..: ఎన్‌హెచ్‌ఆర్‌సీ
రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పంది స్తూ..రోహింగ్యాల అంశాన్ని మానవతా దృక్పథంతోనే పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పింది. అయితే రోహింగ్యాలు అక్రమ వలసదారులని, వారిని వెనక్కి పంపిస్తామన్న ప్రభుత్వ విధానంపై తాము స్పందించబో మంది. ‘రోహింగ్యాల అంశాన్ని మానవతా దృక్పథంతోనే పరిగణనలోకి తీసుకున్నాం. ప్రభుత్వ వైఖరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution